నాగర్‌కర్నూల్ శిశువు మృతి.. కలెక్టర్, ఎస్పీకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
x

నాగర్‌కర్నూల్ శిశువు మృతి.. కలెక్టర్, ఎస్పీకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

నాగర్‌కర్నూల్ జిల్లాలో కుల వివక్ష దాడిలో పసికందు మరణించిందన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.


నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కుల వివక్ష దాడి కారణంగా రెండు నెలల పసికందు మరణించిందన్న ఆరోపణలపై తెలంగాణ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను ఆదేశించింది.

అసలేం జరిగింది?

న్యాయవాది వినోద్ హిందుస్తానీ ఫిర్యాదు ప్రకారం.. ఫిబ్రవరి 18న జాతరలో మౌనిక అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఆలయ ప్రవేశం చేస్తుండగా వివక్ష ఎదురైంది. ప్రవేశ రుసుముపై రశీదు అడిగినందుకు ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఆమెను కులం పేరుతో దూషించి, కిందకు నెట్టివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె భుజంపై ఉన్న పసికందు కిందపడిపోగా, నిందితులు చిన్నారిని తొక్కడంతో తీవ్ర గాయాలై మరణించిందని బాధితులు పేర్కొన్నారు. అడ్డువచ్చిన మౌనిక భర్త గణేష్‌పై కూడా ఐరన్ రాడ్లు, కొబ్బరికాయలతో దాడి చేసినట్లు ఫిర్యాదులో వివరించారు.

పోలీసుల వెర్షన్:

మరోవైపు, ఈ కేసులో పోలీసులు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 18న గణేష్ మరియు శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదులో పసికందుపై దాడి జరిగినట్లు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం ఫిబ్రవరి 21న మాత్రమే చిన్నారి మరణవార్తను కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారని ఆయన వెల్లడించారు.

వైద్య నివేదిక ఏం చెబుతోంది?

చిన్నారి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో బాహ్యంగా కానీ, అంతర్గతంగా కానీ ఎటువంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. సదరు చిన్నారి గడువు కంటే ముందే (నెలలు నిండకుండా) కేవలం 1.44 కిలోల బరువుతో జన్మించిందని, శ్వాసకోశ సమస్యలతో గతంలో నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందిందని పోలీసులు గుర్తుచేశారు.

ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు:

రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని న్యాయవాది చేసిన ఆరోపణలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగా ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read More
Next Story