రు.1700  కోట్లతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి విస్తరణ
x
Hyderabad Nizams Institute of Medical Sciences

రు.1700 కోట్లతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి విస్తరణ

అదనంగా రానున్న 2000 పడకలు


హైదరాబాద్ లోని ప్రభుత్వ రంగ నిమ్స్ (Nizam Institute of Medical Sciences NIMS)కు మహర్దశ పట్టబోతున్నది. ఈసంస్థను బలోపేతం చేసేందుకు రు.1700 కోట్లతో ఒక ప్రణాళిక రూపొందించారు. భారీగా నిమ్స్ విస్తరణ చేపట్టేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజక్టు వల్ల మరొక 2000 పడకలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం నిమ్స్ లో 1639 పడకలు ఉన్నాయి. తెలంగాణకే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఉన్నత ప్రమాణాల వైద్య సేవలు అందించే నిమ్స్ 19.54 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజక్టు పూర్తయితే, నిమ్స్ మొత్తం పడకల సంఖ్య 3,639కి చేరుకుంటుంది.

రోగులకు మెరుగైన సేవలు అందించడమే కాదు, రోగుల రద్దీని తగ్గించడం ప్రత్యేక చికిత్సా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ విస్తరణ లక్ష్యం అని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టులో ఒక కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మాణం, అత్యవసర సేవల విభాగం విస్తరణ, అదనపు ఐసియు సౌకర్యాలతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజక్టు కు సంబంధించిన ప్రధాన ఆసుపత్రి సముదాయంలో సివిల్ నిర్మాణ పనులు క్రమంగా జరుగుతున్నాయి. ఈ భవనంలో 13 అంతస్థులు ఉంటాయి. ప్రధాన భవనానికి సంబంధించిన ఎనిమిది అంతస్తులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన ఐదు అంతస్తులలో పనులు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు, అత్యవసర బ్లాక్ కి చెందిన రెండు అంతస్తులు పూర్తయ్యాయి. ఈ విభాగం నిర్మాణం పూర్తయితే 38 అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లుచ, హైబ్రిడ్ ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ కండిషన్డ్ తోపాటు అధిక సామర్థ్యం గల పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్ట్రేషన్ వ్యవస్థలు ఉంటాయి.

ఇక ముందు పిల్లల సంరక్షణపై నిమ్స్ ప్రత్యేక దృష్టి పెడుతున్నది. పీడియాట్రిక్ కేర్ కోసం ఎనిమిది కొత్త సబ్-స్పెషాలిటీలను ప్రవేశపెట్టాలని కూడా NIMS యోచిస్తోంది. వీటిలో పీడియాట్రిక్ నెఫ్రాలజీ, రుమటాలజీ, ఇమ్యునో డెఫిషియెన్సీ, కార్డియాలజీ, ఆంకాలజీ ఉన్నాయి. ఈ సబ్-స్పెషాలిటీలలో చాలా వరకు ప్రస్తుతం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిమితంగా ఉన్నాయి. కొత్త విభాగాలు వస్తే పిల్లల హెల్త్ కేర్ వ్యవస్థ చాలా పటిష్టమవుతుంది.

నిమ్స్ విస్తరణ వల్ల మూడు CT స్కాన్ యంత్రాలు, రెండు MRI యంత్రాలు, హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్‌లు, CT-MRI సౌకర్యాలు అధునాతన డిజిటల్ ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త వైద్య పరికరాల విలువ సుమారు ₹100 కోట్ల వరకు వుంటుంది. ఈ విస్తరణ ఎమర్జన్సీ, ట్రామా సేవలు బాగా బలపడతాయని అధికారులు చెబుతున్నారు.


Read More
Next Story