
ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏంటి ?
బడ్జెట్ ప్రసంగంలో పలుమార్లు ప్రస్తావన ఉన్నా, నిర్మాణంపై స్పష్టత లేకపోవడం చర్చకు దారితీసింది.
తెలంగాణ ఫ్యూచర్ సిటీ చెప్పుకోవడానికే తప్ప.. నిధులకు నోచుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని ఢంకా మోగిస్తున్న ప్రభుత్వం.. 2026-27 బడ్జెట్‌లో ఆ సిటీకి పైసా కూడా నిధులు కేటాయించనలేదు. పైగా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఫ్యూచర్ సిటీతో అభివృద్ధి ఉంటుందని చెప్పారే కానీ, ఆ సిటీ నిర్మాణానికి ఏం చేస్తున్నాం అన్న ఊసే ఎత్తలేదు. అంతర్జాతీయ సమ్మిట్‌కు ఫ్యూచర్ సిటీ వేదిక అయిందని చెప్పిన ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క.. ఆ సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? అనేది కూడా చెప్పకపోవడం విశేషం. బడ్జెట్ ప్రసంగం మొత్తంలో ఫ్యూచర్ సిటీ ఐదారుసార్లు ప్రస్తావనకు వచ్చినా.. నిధుల కేటాయింపులో ఒక్కసారి కూడా వినిపించలేదు.
‘‘తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే భవిష్యత్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025” ను డిసెంబర్ 8-9 తేదీలలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో విజయవంతంగా నిర్వహించాం. ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వేల మంది అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు’’ అని భట్టి గుర్తు చేశారు. దీంతో ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ సమ్మిట్‌కు ఒక వేదికగా మాత్రమే వినబడింది.
ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సమ్మిట్ నిర్వహించారంటే.. సిటీ నిర్మాణం పూర్తయిందేమో అనుకుని పొరబడొద్దు. ఆ సిటీ నిర్మాణం ఇంకా జరగలేదు. ‘‘ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే, ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది’’ అని బడ్జెట్ ప్రసంగంలో భట్టి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నిధుల కేటాయింపుకు నోచుకోని ఫ్యూచర్ సిటీ.. అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకోవడానికి అద్భుతమైన ఉదాహరణగా మారింది.
పోలీస్ వ్యవస్థ బలోపేతంలో కూడా ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని భట్టి అన్నారు. పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం కోసమే పోలీసు వ్యవస్థ పరిధిని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ అనే నాలుగు కమీషనరేట్లుగా పునర్ వ్యవస్థీకరించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీ చారిత్రతక ముందడుగు
అసెంబ్లీలో బడ్జట్ ప్రసంగం వినిపించిన భట్టి విక్రమార్క.. ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కొనియాడారు. ఈ సిటీని రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రతక ముందడుగుగా అభివర్ణించారు. ‘‘హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగి ఉంది. ఆనాటి కుతుబ్ షాహీల నుండి, నిజాం పాలకుల వరకు.. ఆధునిక కాలంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వంటి అద్భుతాలతో ఈ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది’’ అని గుర్తు చేశారు.
అదే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో అదే 30 వేల ఎకరాలలో ఏర్పాటు చేసే "భారత్ ఫ్యూచర్ సిటీ"తో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని భట్టి పేర్కొన్నారు. ‘‘రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది’’ అని ప్రత్యేకంగా చెప్పారు.
గొప్పలే తప్ప నిధులు నిల్..
ఫ్యూచర్ సిటీ గురించి గొప్పగా గొప్పలు చెప్పిన ప్రభుత్వం నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపింది. అనేక సందర్భాల్లో తమ ప్రభుత్వం నిర్మించే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తలమానికంగా నిలుస్తుందని జబ్బలు చరిచిన వారు.. నిధులు చేటాయించడం మర్చిపోయారు. ఇదే విషయంపై ప్రజలు కొందరు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ‘నిధులు లేకుండానే అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారేమో’ అంటూ చురకలంటిస్తున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి ప్రాజెక్ట్ అని సీఎం సహా మంత్రులు ఢంకా మోగించిన చెప్పిన ఈ ఫ్యూచర్ సిటీకి అసలు నిధులు ఎందుకు కేటాయించలేదు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

