డీలిమిటేషన్‌పై స్టాలిన్ అల్టిమేటం..
x

డీలిమిటేషన్‌పై స్టాలిన్ అల్టిమేటం..

డీలిమిటేషన్‌పై తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ గళమెత్తారు. లోక్‌సభలో రాష్ట్రానికి ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను తగ్గించేది లేదని, రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


Click the Play button to hear this message in audio format

నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీకి అవకాశం లేదని స్పష్టం చేశారు.

శుక్రవారం నవంబర్ 27న ఎక్స్‌ వేదికగా స్టాలిన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. న్యాయమైన డీలిమిటేషన్‌ కోసం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా తొలిసారిగా చెన్నైలో ఒక్కతాటిపైకి వచ్చారని గుర్తుచేశారు. ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీ, సంయుక్త కార్యాచరణ కమిటీ ఇప్పటికే ఆమోదించిన తీర్మానాలను మరోసారి ప్రస్తావించారు.


వెనక్కి తగ్గేది లేదు!

డీలిమిటేషన్‌ విషయంలో తమిళనాడు వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్టాలిన్ స్పష్టం చేశారు. మొదటిది.. లోక్‌సభలో రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను ఏమాత్రం తగ్గించకూడదు. రెండోది.. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సీట్ల నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలి.

ఈ రెండు డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మీడియా ఊహాగానాలు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు తమ సంకల్పాన్ని మార్చలేవని వ్యాఖ్యానించారు. అధికార పదవుల కోసం సూత్రాలను పక్కనపెట్టినవారు తమిళనాడు ప్రయోజనాలను డీఎంకే ఎప్పటికీ బేరం పెట్టదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.


పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ..

మరోవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ తిరిగి సమావేశం కానున్నాయి. డిసెంబర్ 3తో ఈ సమావేశాల కార్యక్రమాలు ముగిసే అవకాశం ఉంది.

అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టనుందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. కానీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలపై రాజ్యాంగ సవరణ బిల్లులు వచ్చే అవకాశముందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు?

2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 850 వరకు పెంచే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసే అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.


దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆందోళన..

తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది నేతలు భావిస్తున్నారు.

తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. జనాభా పెరుగుదలను నియంత్రించినందుకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే ఎలా అన్నది ఆయా రాష్ట్రాల ప్రధాన ప్రశ్న.

మొత్తంగా డీలిమిటేషన్‌ అంశం ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత రాజకీయాల మధ్య కీలక చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక డీలిమిటేషన్‌ దిశగా ముందడుగు వేస్తుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Read More
Next Story