
భయమొద్దు.. పెట్రోల్ కావాల్సినంత ఉంది: కమిషనర్
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అధిక బుకింగ్స్ వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్ ప్యానిక్ స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్ ఎక్కడ దొరకదో అని ప్రజలు పెట్రోల్ బంకుల దగ్గర బారులుదీరుతున్నారు. గంటల తరబడి క్యూలలో నిల్చుని పెట్రోల్ పోయించుకుంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని, తెలంగాణలో కూడా అదే పరిస్థితి తప్పదన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ సృష్టించాయి. దీంతో ప్రజలంతా ఆందోళన చెంది బంకులు పరుగులు పెట్టారు.
రెండు రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా తయారవడంతో ఈ పరిస్థితిపై తాజాగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. ప్రజలు భయపడొద్దని, కావాల్సినంత పెట్రోల్ ఉందని వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని బంకుల్లో పెట్రోల్ లేదని, ఔట్ ఆఫ్ స్టాక్ అన్న బోర్డ్‌లు కూడా ప్రజలు ఒక్కసారిగా అధికమొత్తంలో పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఏర్పడిన అత్యంత తాత్కాలిక కొరత మాత్రమేనని వివరించారు. పెట్రోల్ సరఫరా చేయడానికి ట్యాంకర్లు కూడా రెడీగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని ఆయన తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు. బుధవారం ఒక్కరోజే 2,123 ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ సరఫరా చేసినట్లు వివరించారు. మొత్తం 10,799 కిలో లీటర్ల పెట్రోల్ పంపిణీ జరిగిందని చెప్పారు. సాధారణంగా రోజుకు 5,883 కిలో లీటర్ల వినియోగం ఉంటే, ఆ రోజే 84 శాతం అధికంగా సరఫరా చేసినట్లు తెలిపారు.
డీజిల్ విషయంలో కూడా 22,127 కిలో లీటర్లను ఆయిల్ కంపెనీలు అందించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 596 పెట్రోల్, డీజిల్ అవుట్‌లెట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి బంక్‌లో పౌరసరఫరా, సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ శాఖల బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. బుధవారం కనిపించిన రద్దీతో పోలిస్తే గురువారం బంకుల వద్ద రద్దీ తగ్గిందని వివరించారు.
ఎల్పీజీ సరఫరాలపై కూడా వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి 1,28,24,087 కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. రోజుకు సగటుగా 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం ఒక్కరోజే 2,19,980 సిలిండర్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు అధికంగా బుకింగ్స్ చేయడం వల్లే కొంత ఒత్తిడి ఏర్పడుతున్నట్లు వివరించారు.
పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు 1,03,275 ఉన్నాయని తెలిపారు. రోజుకు 2,78,418 క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎన్జీ, సీఎన్జీ విస్తరణపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లాంట్లకు 24 గంటల్లో అనుమతులు ఇవ్వడం, రాయితీలు అందించడం జరుగుతోందని వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో ఇంధన నిల్వలు సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితిపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

