ప్రజ్వల్‌ కేసు విషయంలో మౌనం వీడిన దేవెగౌడ
x

ప్రజ్వల్‌ కేసు విషయంలో మౌనం వీడిన దేవెగౌడ

జేడీ(ఎస్) పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. తన మనవడిని దోషిగా తేలితే చర్యలు తీసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.


జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆ పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. తన మనవడిని దోషిగా తేలితే చర్యలు తీసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

తన కుమారుడు, జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసు బనాయించారని చెప్పారు. 92వ వసంతంలోకి అడుగుపెట్టిన గౌడ విలేఖరులతో మాట్లాడుతూ.. రేవణ్ణపై నమోదయిన కేసును కోర్టు విచారిస్తున్నందున తాను మాట్లాడదలుచు కోలేదన్నారు. ‘‘లైంగిక వేధింపుల కేసు నమోదు వెనక చాలా మంది వ్యక్తులు ఉన్నారు, నేను ఎవరి పేర్లను ప్రస్తావించదలచుకోలేదు. కేసుతో ప్రమేయం ఉన్న వారందరిపై చర్య తీసుకోవాలి. బాధిత మహిళలకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి" అని దేవెగౌడ పేర్కొన్నారు.

“ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రేవణ్ణపై వచ్చిన ఆరోపణల గురించి (వాస్తవాలు) ప్రజలు తెలుసుకున్నారు. ఒక కేసులో అతనికి బెయిల్ వచ్చింది. మరొక కేసులో రావాల్సి ఉంది.'' అని కుమారస్వామి చేసిన ప్రకటనతో ఏకీభవిస్తూ..దోషులుగా తేలితే ఎవరినీ విడిచిపెట్టొదన్నారు.

వేడుకలకు దూరం..

గౌడ తన పుట్టినరోజును జరుపుకోకూడదని ఇటీవల తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా తనకు శుభాకాంక్షలు తెలపాలని కోరారు.

హాసన్ నియోజకవర్గ బీజేపీ-జేడీ(ఎస్) కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన ప్రజ్వల్ (33) మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం ఇటీవల అధికార కాంగ్రెస్, బీజేపీ-జేడీ(ఎస్) మధ్య రాజకీయ దుమారం లేపింది. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వేళ.. ప్రజ్వల్ సెక్స్ వీడియోలో బయటకు రావడంతో ఆయన ఏప్రిల్ 27న జర్మనీకి వెళ్లిపోయాడని, ఇంకా పరారీలో ఉన్నాడని సమాచారం. అతడిని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యింది.

పేర్లు చెప్పదలుచుకోలేదు..

రాజకీయంగా తన కుటుంబం పరువు తీసేందుకు కుట్ర జరిగిందా అని ప్రశ్నించగా.. ‘‘నిజమే.. కేసులో చాలా మంది ప్రమేయం ఉంది. పేర్లు చెప్పదలుచుకోలేదు. ఏ చర్య తీసుకోవాలో కుమారస్వామి చెబుతారు." అని సమాధానమిచ్చారు.

ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల లీకేజీ వెనక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారని బీజేపీ నేత జి.దేవరాజేగౌడ చేసిన ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు.. కుమారస్వామి సమాధానమిస్తాడని చెప్పారు.

వాటిపై కుమారస్వామి స్పందిస్తారు..

'దేవరాజేగౌడ ఏం మాట్లాడాడో మీడియాలో చూశాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కుమారస్వామి వీటన్నింటిపై చురుగ్గా స్పందిస్తున్నారు. ఆయన మాట్లాడతారు. ఈ సమయంలో నేను మాట్లాడను. నేను లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేశాను. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మిమ్మల్ని (మీడియా) కలుస్తాను." అన్నారాయన.

తన ఇంటి దగ్గర క్యాంపులో ఉన్న మీడియా ప్రతినిధులను కూడా వెళ్లిపోవాలని గౌడ అభ్యర్థించారు.

Read More
Next Story