హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు నిర్ణీత గడువు లేదు: కేంద్రం
x

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు నిర్ణీత గడువు లేదు: కేంద్రం

మెట్రో విస్తరణపై సాంకేతిక, ఆర్థిక అంశాలపై పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్ర నిర్ణయం, కమిటీ నివేదికపై తదుపరి చర్యలు ఆధారపడనున్నాయి.


హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఆమోదానికి ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవని, అనేక సాంకేతిక, ఆర్థిక అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు. 2017 మెట్రో రైల్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఫేజ్-2 ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, నిధుల లభ్యత, వనరుల సమీకరణ ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌తో రెండో దశను అనుసంధానం చేయడంలో సాంకేతిక సవాళ్లు ఉన్నాయని సాహో సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై లోతైన అధ్యయనం కోసం కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని నియమించిందని వెల్లడించారు. ఇక మెట్రో విస్తరణకు సంబంధించి మూడు రకాల ఆప్షన్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వాటిపై రాష్ట్రం తన నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర అభిప్రాయం ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగి, విమానాశ్రయ మార్గం, ఐటీ కారిడార్లలో రద్దీ తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారీ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని పీపీపీ మోడల్ లేదా ఇతర ఆర్థిక వనరులపై కూడా కేంద్రం పరిశీలన చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉందని, సాంకేతిక నివేదికల తర్వాతే నిధులపై స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు. మొత్తంగా మెట్రో ఫేజ్-2పై కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై స్పష్టత వచ్చినా, ఆమోదంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

Read More
Next Story