ఖమ్మంలో విజయోత్సవ ర్యాలీలు నిషేధం: సీపీ సునీల్ దత్ హెచ్చరిక
x

ఖమ్మంలో విజయోత్సవ ర్యాలీలు నిషేధం: సీపీ సునీల్ దత్ హెచ్చరిక

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలు, డీజేలపై నిషేధం విధిస్తూ సీపీ సునీల్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.


మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఎన్నికల విజేతలకు ఖమ్మం జిల్లా సీపీ కీలక హెచ్చరిక చేశారు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, వేడుకలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ఆంక్షలు విధించారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా బాణాసంచా కాల్చడం, డీజేల వినియోగం, బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని సీపీ ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గుంపులుగా తిరగడం కూడా నిషేధమని పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఒకవేళ పోలీసు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సునీల్ దత్ హెచ్చరించారు. ఫలితాల అనంతరం అల్లర్లు సృష్టిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని కఠినంగా చెప్పారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story