తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ దశసూత్ర కార్యాచరణ
x

తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ దశసూత్ర కార్యాచరణ

నేడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఒక జ్ఞాపకం. 1982 మే 28 నాడు తిరుపతిలో జరిగిన తెలుగు దేశం పార్టీ సదస్సలో దీనిని ఎన్టీఆర్ విడుదల చేశారు.


నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గొప్పనటుడు, తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు ఎన్టీ రామారావు (మే 28, 1923-జనవరి 18, 1996) జయంతి


ఉపోద్ఘాతం:

రాజరికపు వ్యవస్థలోను, తదనంతరం బ్రిటిషువారి పాలనా కాలంలోను ప్రజలను అన్నివిధాల అణచివుంచటానికి ప్రభుత్వ పాలన నుండి వారిని దూరంగా వుంచటానికి పాలక వర్గాలు సాధారణ ప్రజలకు తెలియని భాషనే పాలనా భాషగా పోషిస్తూ వచ్చాయి.

రాజ్యశక్తికి అదనంగా భాషను గూడా ఒక ఆయుధంగా ఉపయోగించు కొని వారు ప్రజలను అణచి వుంచుతూ వచ్చారు. ప్రజాభాషలు కానట్టి సంస్కృతం, పారశీకం, ఇంగ్లీషు భాషలనే వారు అధికార భాషలుగా ఆదరిస్తూ, ప్రజల భాషల అభివృద్ధి వికాసాలను నిరోధిస్తూ వచ్చారు.

విద్యాబోధనకు, పరిపాలనకు, విద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాలలో అనేక శతాబ్దాలుగా పరభాషలే

చలామణి అవుతూవచ్చిన కారణంగా పాలక వర్గాలు, మేధావివర్గాలు భాషాపరమైన ఆధిక్యతను పెంచుకొని ప్రజలనుండి దూరమై పోవడమేగాక, సాధారణ ప్రజలలోని సృజనాత్మక శక్తులు నశించిపోతూ వచ్చాయి.

భిన్న భాషలు, సంస్కృతులు గల విశాల భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టి చెందాలన్నా, దేశ సమగ్రత కాపాడాలన్నా, సమైక్యత పెంపొందాలన్నా, అభివృద్ధి సాధించబడాలన్నా ప్రజల భాషలలోనే పరిపాలన సాగాలనే మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని స్వాతంత్ర్య సమరం కాలంనాటి భారత జాతీయ కాంగ్రెస్‌ గుర్తించి, భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం కోరుతూ తీర్మానించింది.

అయితే స్వాతంత్ర్యం వచ్చి మూడున్నర దశాబ్దాలు గడచిపోయినా స్వభాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి రెండున్నర దశాబ్దాలు గడచినా తెలుగు భాషకు ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాలలో, విద్యాలయాల్లో స్థానంలేని దౌర్భాగ్య స్థితిలోనే తెలుగు ప్రజలు ఉంచబడ్డారు.

రాజ్యభాషగా పరిగణించబడి ప్రభుత్వంచే అధికారయుతంగా ఆదరింపబడని ఏ భాషా పరిపుష్టి చెందదు. వికసించదు.

ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టులలో, విద్యాలయాల్లో అన్ని స్థాయిలలో ఉపయోగపడగల విధంగా తెలుగు రాష్ట్రంలో స్థానం లేకుండా చేయటానికి ప్రజా వ్యతిరేకులైన పాలక వర్గాలవారు ఇంతకాలంగాసాగిస్తూ వచ్చిన మోసపూరిత విధానాలు ఇకముందు సాగనివ్వమని తెలుగు దేశం పార్టీ తీవ్ర హెచ్చరిక చేస్తున్నది.

ఎన్టీయార్ ప్రకటించిన కార్యచరణ

1. సచివాలయం మొదలు, సమితి కార్యాలయం వరకు అన్ని స్థాయిలలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో తక్షణం తెలుగు ఏకైక అధికార భాషగా పరిగణించబడి తెలుగు భాషలోనే రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగాలి.

2. దిగువ న్యాయస్థానాలు మొదలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వరకు అన్నిస్థాయిల్లో తెలుగు భాషలోనే కార్యకలాపాలు జరగాలి.

3. ప్రాథమిక పాఠశాలలు మొదలు, విశ్వవిద్యాలయాల వరకు అన్ని స్థాయిలలో తెలుగుభాషే బోధనా భాషగా గుర్తించబడాలి.

4. గవర్నరు పిల్లలు మొదలు శ్రామికుని బిడ్డల వరకు బాల బాలికలందరికీ ఒకే విధమైన ఏక ప్రమాణ విద్యాభ్యాసం జరిగేవిధంగా విద్యావ్వవస్థను సంస్కరించాలి. అంతేకాక తెలుగునాడులో తెలుగు భాష ఒక్కటి మాత్రమే తప్పనిసరిగా నేర్చుకోవలసిన భాషగా అమలు చేయాలి.

5. హిందీ, తమిళం, కన్నడం, మలయాళం లాంటి ఇతర భారతీయ ప్రజా భాషలుగాని, ఇంగ్లీషు, రష్యన్‌, జర్మన్‌, జపానీస్‌ లాంటి విదేశీ భాషలు గాని, నేర్చుకోదలచిన వారికి అవి ఐచ్చిక భాషలుగా బోధించటానికి ఏర్పాట్లు జరగాలి.

6. తెలుగునాడులో వుండే తంతి తపాలా రైల్వేలాంటి ప్రజా జీవన సంబంధిత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో గూడా తెలుగుభాషలోనే కార్యకలాపాలు జరగాలి.

7. తెలుగునాడులో వున్న పారిశ్రామిక, వ్యాపారసంస్థలు అవి ప్రభుత్వ సంస్థలయినా, ప్రయివేటు సంస్థలయినా - అన్నీ, తమ కార్యకలాపాలన్నీ తెలుగులోనే నిర్వహించాలి.

8. కేంద్ర ప్రభుత్వంలోను, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు మాత్రమే ఇంగ్లీషుభాష వాడకాన్ని పరిమితం చేయాలి.

9. తెలుగునాడులో భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్షాలకు చెందిన వారు తమ పిల్లలకు తమ మాతృభాషలో విద్యాబోధన చేసుకునేందుకు సౌకర్యాలు కలుగ చేయటంతోపాటు, తెలుగు నేర్చుకునే విధానం అమలు పరచాలి.

10. తెలుగునాడులో ఉర్దూ మాతృభాషగా గల ప్రజలు అసంఖ్యాకంగా వున్న కొన్ని ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలలో ఉర్దూ భాషకు తగు ప్రాధాన్యత యివ్వబడాలి. భాషారంగంలో ఈ దశసూత్ర పథకాన్ని తక్షణం అమలులో తీసుకొని రావటానికి తెలుగుదేశం తనను తాను అర్చించుకొంటూ, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు అన్నింటా ప్రథమస్థానం లభింప చేయుటకు, అవసరపడిన ఎట్టి త్యాగాలకయినా సంసిద్దులుగా వుండాలని తెలుగు ప్రజలకు పిలుపు యిస్తున్నది.

Read More
Next Story