తండ్రి లేడు.. తల్లికి క్యాన్సర్..  అయినా సివిల్స్ లో ఆలిండియా ర్యాంక్
x

తండ్రి లేడు.. తల్లికి క్యాన్సర్.. అయినా సివిల్స్ లో ఆలిండియా ర్యాంక్

కాలేజ్ లో అడుగుపెట్టిన మొదటి ఏడాదే తండ్రి మరణించాడు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. తల్లి కోసం ఐఏఎస్ కావాలనుకున్న యువకుడి కథ..


కాలం కలిసి వస్తేనే విజేతలవుతామని కొందరూ అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న కారణాలను భూతద్దంలో పెట్టి చూస్తూ అవే ప్రపంచ సమస్యల చూస్తూ చెడు మార్గంలో ప్రయాణించేవారు ఎందురున్నారో.. అలాంటి వారికి అనిమేష్ ప్రధాన్ జీవితం ఓ స్పూర్తి దాయకం అని చెప్పవచ్చు.

ఏంటీ అతని స్పెషల్ అనుకుంటున్నారా? యూపీఎస్సీ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా రెండో ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ఒడిశాలోని తాల్చేర్‌కు చెందిన అనిమేష్ ప్రధాన్ అనే 24 ఏళ్ల యువకుడి ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.

అనిమేష్ కాలేజీలో చేరిన మొదటి ఏడాదే.. తండ్రి చనిపోయాడు. తండ్రి మరణం నుంచి కుటుంబం కోలుకోక ముందే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ సమయంలో అనిమేష్ తీవ్రంగా కుంగుబాటుకు గురయ్యాడు. సొంతంగా కాళ్లపై నిలదొక్కుకుంటూనే.. తన తల్లి కోసం ఐఏఎస్ అధికారి కావాలని కలలు కన్నాడు. సివిల్స్ ఫలితాలు ప్రకటించిన తరువాత తన తల్లి కలే కాదు, మొత్తం ఒడిషాను గర్వించేలా చేశాడు అనిమేష్.
అయితే కొడుకు విజయాన్ని తన విజయంగా భావించే తల్లి ఇప్పుడు ఆయనతో లేరు. దురదృష్టవశాత్తు, అనిమేష్ తల్లి సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో మరణించింది.
తన విజయంతో అనిమేష్ ఒడిశాను 20 ఏళ్లుగా వేధిస్తున్న శాపాన్ని కూడా తరిమేశాడు. ప్రతిష్టాత్మక UPSC పరీక్షలో రాష్ట్రం తరఫున ఎవరైనా టాప్ ర్యాంక్ సాధించి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. గతంలో ఒడిశాకు చెందిన రూపా మిశ్రా 2003లో టాపర్ (ఏఐఆర్-1)గా నిలిచింది. ఇప్పుడు అనిమేష్ ఆలిండియా నంబర్ టూ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
ఇంతకుముందు నా పరీక్ష ఫలితాలు మొదటగా అమ్మతోనే..
“ప్రతి రిజల్ట్ తర్వాత నేను ముందుగా మా అమ్మకు తెలియజేసేవాడిని. కానీ, ఆమె ఇప్పుడు నా దగ్గర లేదు. నా ఆనందాన్ని పంచుకోవాలనుకున్న మొదటి వ్యక్తి ఆమె. కానీ, చాలా తొందరగా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది” అనిమేష్ తన కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు.
అనిమేష్ తన జీవితంలో జరిగిన కష్టమైన రోజులను గుర్తు చేసుకుంటూ.. “నా తల్లి క్యాన్సర్ చికిత్స తీసుకుంటోంది. ఇదే సమయంలో నా ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలిసేది కాదు. నా తల్లితో గడపడానికి నాకు అతి తక్కువ సమయం ఉందని తెలిసేది. కానీ నా తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్లే ముందు నేను యూపీఎస్సీ ని క్లియర్ చేయాలని అనుకున్నాను. నా తల్లికి కూడా కావాల్సింది అదే.. అందుకే ధైర్యంగా ముందుడుగు వేశాను”
అయితే, UPSC ఫలితాలు ప్రకటించడానికి కేవలం ఒక నెల ముందు అనిమేష్ తల్లి మరణించింది. ఏదేమైనప్పటికీ, ఆమె ఆశీర్వాదం ఆమె కొడుకు ఊహించలేని విధంగా చేసింది- ఎలాంటి కోచింగ్ లేకుండా UPSC తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేసేలా తల్లి ఇచ్చిన ఆశీర్వాదం పనిచేసింది.
తన ప్రిపరేషన్‌తో పాటు, NIT రూర్కెలా నుంచి B.Tech (కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేట్ అయిన అనిమేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో కూడా పనిచేశాడు. ఓ వైపు జాబ్ చేస్తూనే, తన యుపిఎస్‌సి ప్రిపరేషన్ కోసం రోజువారీ షెడ్యూల్‌లో 5-6 గంటలు చదువుకోసం కేటాయించేవారు. అతని కృషి ఎట్టకేలకు ఫలించి AIR-2ను పొందాడు.
తన ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అనిమేష్ తన కృతజ్ఞతలు తెలిపారు. “నేను చాలా సంతోషంతో ఉన్నాను. ఈ రెండేళ్ల ప్రయాణం నాకు అంతసులభంగా సాగలేదు. ఇంట్లో పనులు సరిగ్గా జరగలేదు. అవన్నీ ఉన్నప్పటికీ, నేను నా తల్లిదండ్రులు, నా సోదరి, స్నేహితులు, నా మొత్తం గ్రామం ఆశీర్వాదంతో ఈ పనిని సాధించడం సంతోషంగా ఉంది.
అనిమేష్ సాధించిన విజయాన్ని గురించి, IOCL చైర్మన్ సామాజిక మాధ్యమం 'X'లో ఇలా పోస్ట్ చేశాడు. "మా అనిమేష్ ప్రధాన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1వ ప్రయత్నంలో 2వ ర్యాంక్ సాధించిన, ఈ అసాధారణ IOC యాన్‌కి హృదయపూర్వక అభినందనలు. సవాళ్లను అధిగమించి, దేశానికి సేవ చేయాలనే కలను సాకారం చేసుకున్నాడు. అనిమేష్‌కు మేము ఎన్‌ఐటి రూర్కెలా పూర్వ విద్యార్థులం అనే బంధాన్ని కూడా పంచుకోవడం వల్ల నాకు ఇది రెట్టింపు ఆనందంగా ఉందన్నారు.
Read More
Next Story