
మార్కెట్లోకి 'దొంగ మామిడి పళ్లు’ వస్తున్నాయ్, జాగ్రత్త
వాసన చూడండి, కెమికల్ వాసన వస్తే పోలీసులకు వెంటనే ఫోన్ చేయండి
వేసవి అంటే చాలా అందరికీ ముందుగా గుర్కొచ్చేది మామిడి పండు. వేసవిలో ఒక్కసారైనా వీటిని తినకుండా ఉండరు. కానీ ఈ మామిడి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తా ఉండాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ఏమాత్రం అసలత్వం, అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదంలో పడినట్లేనని అంటున్నారు సజ్జనార్. తాజాగా మార్కెట్లోకి దొంగ మామిడి పళ్లు వస్తున్నాయని, వాటిని కొనుగోలు చేసే సమయంలో చాలా అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. పైకి నిగనిగలాడుతూ బంగారు వర్ణంలో ఉండి నోరూరిస్తున్నా.. లోపల మాత్రం మనల్ని నంజుకుతినే కెమికల్స్ నిండి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
కొందరు వ్యాపారస్తులు సహజంగా పండాల్సిన పండ్లను త్వరగా పండేలా చేయడానికి రకరకాల రసాయనాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం వాళ్లు కాల్షియం కార్బైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారని, ఈ కెమికల్స్ కారణంగా పండ్లు బయట నుంచి నోరూరించేలా ఉన్నా, లోపల పూర్తిగా పక్వం చెందకుండా ఉంటున్నాయని, పైగా వీటిని తిన్నప్పుడు ఆ కెమికల్స్ మనలోకి వెళ్లి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు చెప్తున్నారు.
ఇలాంటి పండ్లను తింటే గొంతు మంట, వాంతులు, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చని చెబుతున్నారు. దీర్ఘకాలంలో శరీరంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సహజంగా పండిన పండ్లలో బయట రంగు సమానంగా ఉండదని, కానీ కృత్రిమంగా మగ్గించిన పండ్లలో బయటంతా రంగు వేసినట్లుగా ఒకే రంగులో ఉంటుందని, కానీ లోపల మాత్రం వేరే రంగులో ఉంటుందని అధికారులు వివరించారు.
వాసన చూడండి.. ఫోన్ కొట్టండి
ప్రజలు పండ్లను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అసహజ రంగు, రసాయన వాసన, వింత రుచి ఉంటే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కల్తీ పండ్ల విక్రయాలపై పోలీసులు నిఘా పెంచినట్టు చెప్పారు సజ్జనార్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ కోరారు.
హోల్‌సెల్ మార్కెట్లో భారీ దందా
ఈ పండ్లను చిరు వ్యాపారస్తులు కాదు.. భారీగా హోల్‌సేల్ లెవెల్లో చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారీ లెవెల్లో కెమికల్స్‌ను వినియోగిస్తూ పండ్లను పక్వానికి తీసుకొస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. పండ్లను అమ్ముతున్న హోల్‌సేల్ వ్యాపారస్తుల గోడౌన్లతో పాటు అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు హోల్‌సేల్ వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు మామిడి పండ్లను పక్వానికి తీసుకురావడం కోసం కెమికల్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
చుడి బజార్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతను మామిడి పండ్లు పండేలా చేయడం కోసం ‘డైమండ్ రైప్ ఇథలైన్’(Diamond Ripe Ethylene)ను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతను భారీ మొత్తంలో ఈ కెమికల్స్‌ను వాడుతున్నాడని, అతని దగ్గర నుంచి దాదాపు రెండు డజన్ల కెమికల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని హెచ్-ఫాస్ట్(Hyderabad Food Adulteration Surveillance team) అధికారులు చెప్పారు. ఈ దాడుల్లో భాగంగానే సిటీలోని అనేక గోడౌన్ల నుంచి దాదాపు 7 టన్నుల మామిడి మండ్లను సీజ్ చేశారు. వాటి శాంపిల్లను టెస్టింగ్ కోసం పంపినట్లు అధికారులు చెప్పారు.
‘దురాశే ఈ దారుణానికి కారణం’
కెమికల్స్‌ను వినియోగించి పండ్లను పండేలా చేయడంపై మొజంజాహి మార్కెట్‌లోని హోల్‌సేల్ ఫ్రూట్ సెల్లర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యుడు స్పించారు. కొందరు వ్యాపారస్తుల దురాశే ఈ దారుణాలకు కారణమని అన్నారు. ‘‘పండ్లను పక్వానికి తీసుకొచ్చే కెమికల్స్‌ను వ్యాపారస్తులు వాడటానికి అనుమతి ఉంది. కానీ అది కొంత మొత్తంలోనే వాడాలి. అప్పుడే అది హానికరం కాకుండా ఉంటుంది. కొందరు మాత్రం వ్యాపారం కోసం దురాశతో ఈ కెమికల్స్‌ను భారీ మొత్తంలో వినియోగిస్తున్నారు. ఈ కెమికల్స్ చేసే హాని గురించి మాకు బాగా తెలుసు. అందుకే వాటిని మేము అధికంగా వాడము’’ అని వివరించారు.
FSSAI నిబంధనలు ఏం చెప్తున్నాయ్
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI).. పండ్లను పక్వానికి తీసుకొచ్చే కెమికల్స్‌పై నిషేధం విధించలేదు. వాటిని వినియోగించొచ్చనే చెప్తుంది. కానీ వాటి వినియోగానికి కొన్ని పరిమితులు ఉంటాయని, వాటిని దాటి వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తోంతి. గతంలో కూడా అనేక సార్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను అనధికారంగా వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
‘‘సాధారణంగా పండ్లను గమ్యస్థానానికి తీసుకెళ్లే వరకు అవి పచ్చిగానే ఉంచి, తరువాత కృత్రిమంగా మగ్గిస్తారు. దీనివల్ల పండ్ల నిల్వ కాలం పెరుగుతుంది, వినియోగదారులకు సరైన స్థాయిలో పక్వం వచ్చిన పండ్లు అందుతాయి. ఉదాహరణకు, మామిడిపండ్లు పూర్తిగా పండిన తర్వాత త్వరగా పాడైపోయే అవకాశం ఉండటంతో వాటిని ముందుగా పచ్చిగా తరలించి, మార్కెట్‌కు చేరుకున్న తర్వాత మగ్గిస్తారు’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ చెప్తోంది. కానీ ఈ రసాయనాల వినియోగంపై పరిమితులు ఉన్నాయని వివరించింది.
ఏ రసాయనం ఎంత వరకు అనుమతి?
ఎథిలీన్ గ్యాస్: దీని వినియోగం పండ్లను కృత్రిమంగా మగ్గించడానికి అనుమతించబడిన ఏకైక విధానం. ఈ గ్యాస్‌ను కూడా గరిష్టంగా 100 ppm వరకు మాత్రమే ఉపయోగించాలి. పంట రకం, పండు వయస్సు ఆధారంగా పరిమితిని పాటించాల్సిందే.
కాల్షియం కార్బైడ్: దీనిని ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా నిషేధించారు. ఆహార భద్రత నిబంధనల ప్రకారం వాడటం చట్ట విరుద్ధమని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ‘‘కాల్షియం కార్బైడ్‌ను సాధారణంగా గనుల పరిశ్రమ, లోహ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇది నీటితో ప్రతిస్పందించి అసిటిలీన్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఈ గ్యాస్‌తో పండ్లు త్వరగా మగ్గించినా, ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంది. అందువల్ల పండ్లను మగ్గించే ప్రక్రియలో అనుమతించబడిన విధానాలనే పాటించాలని, నిషేధిత రసాయనాల వాడకాన్ని పూర్తిగా నివారించాలి’’ అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
డైమండ్ రైప్ ఇథలీన్ ( Diamond Ripe Ethylene ): దీని వినియోగంపై కూడా ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు పలు పరిమితులు పెట్టారు. దీనిని ప్యాకెట్ల రూపంలో వాడే సమయంలో 5 కేజీల పండ్లకు ఒక్క ప్యాకెట్ మాత్రమే వినియోగించాలని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కెమికల్ నేరుగా పండును తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

