‘ఒకే దేశం..ఒకే నాయకుడు’ ఆలోచన భారతీయులను అవమానించడమే: రాహుల్
దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్క యువ భారతీయుడిని అవమానించడమే”నని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ విస్త్రతంగా పర్యటిస్తున్నారు. సోమవారం (ఏప్రిల్ 15) వయనాడ్‌లోని సుల్తాన్ బతేరిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. తమిళనాడు సరిహద్దులోని నీలగిరి జిల్లాకు చేరుకున్న రాహుల్.. అక్కడి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించి, రోడ్డు మార్గంలో కేరళలోని సుల్తాన్ బతేరి చేరుకున్నారు.
సుల్తాన్ బతేరి వద్ద రాహుల్ ఓపెన్ రూఫ్ ఉన్న కారుపై కూర్చుని ప్రయాణించారు. వందలాది మంది కార్మికులు రోడ్డుకు ఇరువైపులా ఆయన ఫొటోతో కూడిన ప్లకార్డులు చేతపట్టుకుని కనిపించారు.
Sri Rahul Gandhi in Wayanad ❤️
— Congress Kerala (@INCKerala) April 15, 2024
pic.twitter.com/tfWSzEMaDE
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ..“బీజేపీ వ్యక్తులు, ప్రధానమంత్రి ఒకే దేశం, ఒకే ప్రజలు, ఒకే భాష, ఒకే నాయకుడు అంటున్నారు. భాష అనేది పైనుంచి వచ్చేది కాదు. వ్యక్తి హృదయం లోపల నుండి బయటకు వచ్చేది." అని పేర్కొన్నారు.
భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన భారతీయులను అవమానించడమేనని అన్నారు. ‘‘హిందీ కంటే మీ భాష తక్కువ అని కేరళకు చెందిన వ్యక్తికి చెప్పడం కేరళ ప్రజలను అవమానించడమే.. భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్క యువ భారతీయుడిని అవమానించడమే”నని పేర్కొన్నారు.
#WATCH | Kerala: Congress MP and candidate from Wayanad Lok Sabha seat, Rahul Gandhi says, "Today, the main fight is against the ideology of the RSS. The BJP people, the Prime Minister, they say one nation, one people, one language, one leader...Language is not something that is… pic.twitter.com/2HQ11GZScl
— ANI (@ANI) April 15, 2024
మున్ముందు మరిన్ని ర్యాలీలు..
సుల్తాన్ బతేరికి సమీపంలోరైతుల ఎక్కువగా ఉన్న పుల్పల్లిలో రాహుల్ ప్రసంగించనున్నారు. మనంతవాడి, వెల్లముండ, పడింజరతరలో కూడా రోడ్‌షోలు నిర్వహించి పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇటీవల కొన్ని చర్చిలలో ‘కేరళ స్టోరీ’ చిత్రాన్ని ప్రదర్శించడంపై తీవ్ర వివాదం చెలరేగిన నేపథ్యంలో మనంతవాడి బిషప్‌తో కూడా రాహుల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు పొరుగున ఉన్న కోజికోడ్ జిల్లాలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ర్యాలీలో ప్రసంగిస్తారు.
రెండో సారి..
వాయనాడ్ నుంచి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాహుల్, లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత రెండోసారి నియోజకవర్గానికి వచ్చారు. ఈ నెల ప్రారంభంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన రాహుల్, భారీ రోడ్ షో నిర్వహించడం ద్వారా వాయనాడ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.