
ఒక మెసేజ్… ఒక ఫొటో… ఒక ప్రాణం
లోన్ యాప్ వేధింపులతో ప్రేమ్ కుమార్ ఆత్మహత్య. మార్ఫింగ్ ఫొటోలు, బ్లాక్ మెయిల్‌తో ముగిసిన మరో తెలంగాణ విషాద ఘటన.
లోన్ యాప్ వేధింపులతో తెలంగాణలో మరో ప్రాణం పోయింది. 2023 చివరి భాగం నుంచి 2024 మధ్యలో తెలంగాణలో ఇటువంటి ఘటనలు చాలా నమోదయ్యాయి. తాజాగా వాటిలోకి ప్రేమ్ కుమార్ పేరు చేరింది. ఒక వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన పరిచయం, చివరకు ఆత్మహత్యకు దారి తీసింది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో లోన్ యాప్‌ల పేరుతో బ్లాక్ మెయిల్ ఘటనలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణం పొందడం కష్టంగా మారడంతో చాలామంది ఈజీ లోన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అదే వారిని మోసాలకు గురి చేస్తోంది.
లోన్ ఇస్తామని చెప్పే యాప్ నిర్వాహకులు ముందుగా ఆధార్, పాన్ కార్డులు అడుగుతున్నారు. అవి పంపిన వెంటనే ఫొటోలను క్రాప్ చేసి మార్ఫింగ్ చేస్తున్నారు. ఆ ఫొటోలతో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు మొదలుపెడుతున్నారు. ఈ ఉచ్చులో ప్రేమ్ కుమార్ చిక్కుకున్నాడు. నారాయణఖేడ్‌కు చెందిన ప్రేమ్, ముషీరాబాద్ అంబేద్కర్ నగర్‌లో నివసిస్తూ క్యాంటీన్ వ్యాపారం చేస్తున్నాడు.
వ్యాపార నష్టాలతో ఆర్థిక ఒత్తిడిలో ఉన్న సమయంలో అతని వాట్సాప్‌కు లోన్ యాప్ మెసేజ్ వచ్చింది. రిప్లై ఇవ్వడంతో ఆధార్, పాన్ కార్డులు పంపించాడు. కొద్ది సేపటికే ప్రేమ్ ముఖంతో ఉన్న మార్ఫింగ్ న్యూడ్ ఫొటో అతనికి పంపారు. మొదట మూడు వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతామని హెచ్చరించారు. విషయాన్ని ప్రేమ్ తన భార్యకు చెప్పాడు. ఫొటో అతనిది కాదని కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు.
అయినా బెదిరింపులు ఆగలేదు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫొటోలు పంపుతామని మెసేజ్‌లు వచ్చాయి. బూతులతో కూడిన కాల్స్ అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. పరువు పోతుందన్న భయంతో ప్రేమ్ కుమార్ ఆ బ్లాక్ మెయిల్ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో కూడా హైదరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెలియని లోన్ యాప్‌లకు వ్యక్తిగత పత్రాలు పంపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ లోన్‌ల పేరుతో జరుగుతున్న ఈ మోసాలపై అప్రమత్తత అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
లోన్ యాప్ కేసులు ఇంకా ఎన్నో..
లోన్ యాప్‌ల పేరుతో జరుగుతున్న సైబర్ వేధింపులు తెలంగాణలో కొత్తేమీ కాదు. చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వీటికి నియంత్రించడం కోసం అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఫిర్యాదు అందిన క్షణం నుంచి రంగంలోకి దిగి బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి.
2024 డిసెంబర్ 28న, హైదరాబాద్ బేగంపేట్ ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల మహిళ ‘మంజీరా క్యాష్’ పేరుతో వచ్చిన లోన్ యాప్ ద్వారా బ్లాక్ మెయిల్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధార్ వివరాలు తీసుకుని వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తర్వాత 2025 జూలై 27న, హైదరాబాద్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల మహిళను మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి రూ.4.79 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు నమోదు చేశారు. అపరిచిత వ్యక్తితో మొదలైన పరిచయం క్రమంగా బ్లాక్ మెయిల్‌గా మారినట్లు దర్యాప్తులో తేలింది.
అనంతరం 2025 అక్టోబర్ 10న, గోవ్లిగూడా ప్రాంతానికి చెందిన యువతిని లక్ష్యంగా చేసుకుని లోన్ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ వీడియోలతో బెదిరించారు. ఈ కేసులో సుమారు రూ.1.45 లక్షలు వసూలైనట్లు పోలీస్ రికార్డులు వెల్లడించాయి.
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నివేదిక ప్రకారం
2023లో 5 కేసులు, 2024లో 8 కేసులు, 2025లో ఇప్పటివరకు 12 లోన్ యాప్ వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువగా ఫోటో మార్ఫింగ్, వ్యక్తిగత డేటా దుర్వినియోగం, బ్లాక్ మెయిల్ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.
తెలియని లోన్ యాప్‌లకు ఆధార్, పాన్ వివరాలు పంపవద్దని హెచ్చరిస్తున్నారు. బెదిరింపులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. డిజిటల్ లోన్‌ల పేరుతో జరుగుతున్న ఈ నేరాలపై నిఘా పెంచామని, బాధితులకు చట్టపరమైన సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.

