x

పండగ సీజన్లో కంటితడి పెట్టిస్తున్న ఉల్లిపాయ

హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర 80 రూపాయలు దాటింది.


దీపావళి పండుగ సీజన్లో జనాలకు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు కంటతడి పెట్టిస్తున్నాయి. మామూలుగా ఉల్లిపాయ కోసినపుడు జనాల కంట్లో నీళ్ళు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు ఉల్లిపాయను కొయ్యక్కర్లేదు కొనాలి అనుకుంటేనే నీళ్ళొచ్చేస్తున్నాయి. కారణం ఏమిటంటే హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర 80 రూపాయలు దాటింది. 7,8 తేదీల్లో దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో ఏవైనా స్నాక్స్ చేసుకోవాలన్నా లేదా స్పెషల్ వంటకాలతో పాటు రోజువారి వంటల్లో కూడా ఉల్లిపాయ ఉండాల్సిందే.

ఉల్లిపాయ లేని వంటలు తెలుగు ఇళ్ళల్లో దాదాపు ఉండవు. కూరలు, పులుసు, సాంబారు, పచ్చళ్ళు చట్నీ ఇలా ఏవి చేసుకోవాలన్నా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఇలాంటి నేపద్యంలో కిలో ఉల్లిపాయ 80 రూపాయలంటే జనాలు భయపడిపోతున్నారు. అలాగే వెల్లుల్లిపాయ కిలో 280 రూపాయలుంది. ధరలు సరే, అసలు ఉల్లి, వెల్లుల్లి ధరలు ఇంతగా పెరిగిపోవటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే, తెలంగాణలో ఉల్లిపాయల సాగు సుమారు 12వేల ఎకరాల్లో 94 వేల టన్నులు పండుతోంది.

వెల్లుల్లి అయితే అత్యంత తక్కువగా సుమారు 100 ఎకరాల్లో 382 టన్నులు మాత్రమే పండుతోంది. హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉల్లిపాయ వాడకం రోజుకు సుమారు 1200 టన్నులుంది. చిన్నా, పెద్దా హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వీధుల్లోని తోపుడు బండ్లల్లో అమ్ముకునే టిఫిన్ సెంటర్లు అంతా కలిపి సుమారు 80 వేలున్నాయి. వీటిల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి అత్యధికంగా వాడకం ఉంటోంది.

ఉల్లిపాయలు మహారాష్ట్ర, కర్నాటక నుండి రావాల్సినంత రావటంలేదు. అలాగే వెల్లుల్లి మధ్యప్రదేశ్, రాజస్ధాన్ నుండి సరఫరా తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్ లో ఉల్లిపాయ, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Read More
Next Story