తెలంగాణలో మిగిలింది 11 మంది మావోయిస్టులే…
x
తెలంగాణలో కనుమరుగవుతున్న మావోయిస్టులు

తెలంగాణలో మిగిలింది 11 మంది మావోయిస్టులే…

వాళ్లెవరు, ఎక్కడున్నారు, ఎందుకు లొందిరావడం లేదు, తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని ఇంకా నమ్ముతున్నారా?


తెలంగాణలో గత 50 ఏళ్లుగా అటవీ ప్రాంతాలను కుదిపేసిన నక్సలిజం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది. ఒకప్పుడు ఆదిలాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వరకు విస్తరించిన మావోయిస్టుల ప్రభావం… వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, కఠిన ఆపరేషన్లతో క్రమంగా క్షీణించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించిన “ఆపరేషన్ కగార్”తో ఈ ఉద్యమానికి చివరి ఘట్టం మొదలైందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 11 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉండటం ఈ మార్పుకు స్పష్టమైన సంకేతం.

లొంగుబాట్లతో తగ్గిన మావోయిస్టుల ప్రాబల్యం

తెలంగాణలో 2970 నుంచి 2000 సంవత్సరం దాకా భూమి సమస్యలు, పేదరికం వల్ల అటవీ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. నక్సలైట్ల ప్రాబల్య జిల్లాల్లో ప్రతీ రోజు గెరిల్లా యుద్ధం, మందుపాతరల పేలుళ్లు, పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్లు సర్వసాధారణంగా జరుగుతుండేవి.వరంగల్‌లోని కొన్ని విద్యార్థి వసతి గృహాల నుంచి ఆదిలాబాద్ అడవుల దాకా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది.

వరుస ఎన్ కౌంటర్లు

2000 నుంచి 2015వ సంవత్సరం వరకు నక్సలైట్లను అణచివేసేందుకు గ్రేహౌండ్స్ దళాలను ఏర్పాటు చేసి వరుస ఎన్ కౌంటర్లు జరుగుతుండటంతో నక్సలైట్లు అజ్ఝాత జీవితానికి స్వస్థి పలికి లొంగుబాటలో పడ్డారు.గత రెండేళ్లలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 19 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 36 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, స‌రెండర్ విధానాల వల్ల మావోయిస్టులు బలహీనపడ్డారు. ఉన్న మావోయిస్టులు కూడా ఛత్తీస్ ఘడ్ లోని దండకారణ్య ప్రాంతానికి తరలిపోయారు.

తెలంగాణలో 11 మంది మావోయిస్టుల జాడ ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది 500 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.2026వ సంవత్సరంలో ఇతర రాష్ట్రాల వారితో కలిపి మొత్తం 130 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణలో 2023వ సంవత్సరంలో 124 మంది అండర్‌గ్రౌండ్ కేడర్ మావోయిస్టులు ఉండగా, వరుస లొంగుబాట్లతో 2026 నాటికి కేవలం 11 మంది మాత్రమే మిగిలారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

రహస్య స్థావరంలోనే గణపతి ?

జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన మావోయిస్టు సుప్రీం కమాండర్, మోస్ట్ వాంటెడ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు అగ్రనేతగా ఉన్నా వయసు మీద పడటంతోపాటు అనారోగ్యం కారణంగా రహస్య ప్రాంతంలో షెల్టరు తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గణపతితో పాటు మరో 10 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఆపరేషన్ కగార్ ముగిసినా లొంగిపోకుండా ఇంకా అజ్ఝాత జీవితం గడుపుతున్న గణపతితోపాటు 11 మంది ఆచూకీ కోసం తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 11 మంది మావోయిస్టులు అర్బన్ ప్రాంతంలో ఆశ్రయం పొంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇంకా అజ్జాతంలో ఉన్న మావోయిస్టు నేతలు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నక్క సుశీల, రంగబోయిన భాగ్య, (కుడి నుంచి ఎడమకు)

కింది వరుసలో : పసునూరి నరహరి,జోడే రత్నాబాయి, వి శేఖర్ (ఫొటో కర్టసీ :ఎక్స్ పోస్టు, తెలంగాణ డీజీపీ)

అజ్ఞాతంలోనే 11 మంది

ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి, పుష్పనూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్నబాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి లు లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు ఇచ్చినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు."హింసను వీడండి, మీ ఆయుధాలను పక్కనపెట్టి ప్రధాన స్రవంతిలో కలవండి. మీ కుటుంబాల వద్దకు తిరిగి వచ్చి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపండి" అని డీజీపీ బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మిగిలిన 11 మంది మావోయిస్టుల్లో సగం మంది 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని డీజీపీ వెల్లడించారు.అగ్రనేత అయిన గణపతి లొంగిపోతే, హైదరాబాద్ లో ఆయనకు మెరుగైన వైద్యం చేపిస్తామని డీజీపీ చెప్పినా ఆయన మాత్రం లొంగిపోలేదు.
మావోయిస్టులకు పెట్టని కోటగా పేరొందిన తెలంగాణలో నేడు మావోయిస్టు కార్యకలాపాలు ముగిసినట్లేనని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు.

త్వరలో గ్రేహౌండ్స్‌ రద్దు

తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో నక్సల్స్ ఏరివేతలో 36 ఏళ్లుగా కీలకపాత్ర పోషించిన ప్రత్యేక దళం గ్రేహౌండ్స్‌కు ప్రభుత్వం ముగింపు పలకనుంది.1989వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు సీనియర్ ఐపీఎస్ కేఎస్ వ్యాస్ చొరవతో ఏర్పాటు చేసిన గ్రేహోండ్స్ రద్దు కానుంది.
గ్రేహౌండ్స్ కమాండోలను సాధారణ పోలీసు విభాగానికి తరలించాలని యోచిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు.
ముగ్గురు మహిళా కమాండర్లతో సహా కేవలం 11 మంది తిరుగుబాటుదారులు మాత్రమే మిగలడంతో, దాదాపు అయిదు దశాబ్దాల రక్తపాతం తర్వాత తెలంగాణ మావోయిస్టు కథ తుది అధ్యాయానికి చేరుకుంటోందని నిర్ధారించవచ్చు.దాదాపు ఐదు దశాబ్దాలుగా హింస, రక్తపాతం, భయాందోళనలకు కేంద్రంగా నిలిచిన నక్సలిజం… ఇప్పుడు తెలంగాణలో చరిత్ర పుటల్లో కలిసిపోతోంది.అభివృద్ధి, పునరావాసం, కఠిన చర్యల సమన్వయంతో ప్రభుత్వం సాధించిన ఈ మార్పు కీలక మలుపు.ఇంకా అజ్ఞాతంలో ఉన్న కొద్దిమంది కూడా ప్రధాన స్రవంతిలో చేరితే,నక్సల్స్ ఫ్రీ తెలంగాణ అనే లక్ష్యం పూర్తిగా సాకారం అవుతుంది.ఒకప్పుడు బుల్లెట్ గర్జించిన నేలపై… ఇప్పుడు అభివృద్ధి శబ్దం వినిపించే సమయం ఆసన్నమైంది.

నక్సల్స్ ఫ్రీ తెలంగాణ : బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణలో నక్సలైట్ల ప్రాబల్యం చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం అయినప్పటికీ, ప్రస్తుతం అది దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స‌రెండర్ పాలసీలు కలిసి ఈ ఉద్యమాన్ని ముగింపు దశకు తీసుకువచ్చాయి.ఆపరేషన్ కగార్ గడువు ముగియడంతో నక్సల్స్ ఫ్రీ తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. 50 ఏళ్లుగా విజృంభించిన నక్సలిజం పదేళ్లలోనే అంతమైపోయిందన్నారు.
నక్సల్ వామపక్ష తీవ్రవాదం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుందని, సమాజంలోని ఎంతోమంది మంచి వ్యక్తులను హత్య చేసిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

మావోయిస్టు అగ్రనేతలంతా తెలంగాణ వాళ్లే...

సీపీఐ (మావోయిస్టు) అగ్ర నాయకుల్లో ఎక్కువ మంది తెలంగాణ నుంచే వచ్చారు. వరంగల్‌కు చెందిన కొండపల్లి సీతారామయ్య 1980వ సంవత్సరంలో పీపుల్స్ వార్ గ్రూప్‌ను స్థాపించారు. ఆ తర్వాత కరీంనగర్‌లో జన్మించిన ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీకి అత్యధిక కాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వరంగల్‌లో చదువుకున్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ 2025 మేలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్ కు గురయ్యే ముందు మావోయిస్టులకు నాయకత్వం వహించారు.ఒకప్పుడు దేశంలో మావోయిస్టు కార్యకలాపాలకు తెలంగాణ కేంద్రంగా ఉండేది. కానీ సంవత్సరాల తరబడిగా కుంబింగ్ ఆపరేషన్లు, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించడంతో ఆ మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు కుప్పకూలిందని పోలీసులు చెబుతున్నారు.

ఎన్నెన్నో కీలక ఘటనలు

1970వ సంవత్సరం తర్వాత తెలంగాణలో నక్సల్ ఉద్యమం బలపడింది. భూ వివాదాలు, నిరుద్యోగం, 1981 ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల తర్వాత గిరిజన వర్గాల్లో పెరిగిన ఆగ్రహం వంటివి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టులు విస్తరించడానికి దోహదపడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, వరంగల్ కళాశాలలు విద్యార్థుల సమీకరణకు ప్రధాన కేంద్రాలుగా మారాయి.పీపుల్స్ వార్ గ్రూప్ చేతిలో హత్యకు గురైన మొదటి పోలీసు అధికారి 1985లో వరంగల్‌లో కాజీపేట సబ్-ఇన్‌స్పెక్టర్ యాదగిరి రెడ్డి. 1980వ సంవత్సరం చివరి నాటికి ల్యాండ్‌మైన్ పేలుళ్లు, పోలీసులపై దాడులు సర్వసాధారణమైపోయాయి.

నక్సలైట్ల అణచివేతకు గ్రేహౌండ్స్ విభాగం

నక్సలైట్ల తిరుగుబాటును ఎదుర్కోవడానికి 1989వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఐపీఎస్ అధికారి కే.ఎస్.వ్యాస్ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల బడ్జెట్‌తో గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నక్సలైట్ల హింసాకాండ కొనసాగింది. స్టేడియంలో వ్యాస్‌ను నక్సలైట్లు కాల్చి చంపారు. 1999 సెప్టెంబర్ 4వతేదీన హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను మావోయిస్టులు అమీర్ పేట సమీపంలో రోడ్డుపై కాల్చి చంపారు. 2000 మార్చి 7న ఘట్‌కేసర్ సమీపంలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో అప్పటి హోంశాఖ మంత్రి ఎ.మాధవ రెడ్డి మరణించారు.

మావోయిస్టు హింసాకాండలో 520 మంది మృతి

2004లో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్‌తో విలీనమై సీపీఐ (మావోయిస్ట్)గా ఏర్పడిన తర్వాత ఈ ఉద్యమం ఉచ్ఛస్థాయికి చేరింది. ఒక్క 2005 సంవత్సరంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు హింసాకాండలో 520 మందికి పైగా మరణించారు.2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, రాష్ట్రం కొత్త వ్యూహానికి మారింది. గ్రేహౌండ్స్ ఆపరేషన్లతో పాటు, రాష్ట్ర నిఘా సంస్థ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో దృష్టి సారించడం ప్రారంభించింది.40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో గడిపిన జగిత్యాల సీనియర్ మావోయిస్టు నాయకుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఫిబ్రవరి 23వ తేదీన లొంగిపోయారు. మార్చి 7వతేదీన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎదుట మరో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 31 ఏకే-47 రైఫిళ్లతో సహా 124 ఆయుధాలను అప్పగించారు.
Read More
Next Story