ఒంటిమిట్టలో రామస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం
x

ఒంటిమిట్టలో రామస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 26న అంకురార్పణతో ప్రారంభమై, 27న ధ్వజారోహణంతో ఘనంగా జరుగనున్నాయి.


మార్చి 26న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. మార్చి 27న ధ్వజారోహణంతో మహోత్సవాల ప్రారంభం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం పురాతన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినది. ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టితమై ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలా నగరం”గా కూడా పిలుస్తారు.

మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహిస్తారు.


సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ నిర్వహిస్తారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మార్చి 27న ధ్వజారోహణం

మార్చి 27వ తేదీన ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.

అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గంటలకు శ్రీ పోతన జయంతి, కవిసమ్మేళనం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవపై స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Read More
Next Story