
వెలుగుమట్ల లో చీకటి, పేదల గూడు చెదిరింది...
నిజనిర్ధారణ చేసిన ఓపిడిఆర్ భూదాన భూమి లో నివసిస్తున్న ప్రజలపై రియల్ ఎస్టేట్ దాదాలు, గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తేల్చింది
ఖమ్మం పట్టణానికి ఆనుకుని వున్న వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూమిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం చేయటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు 12 సంవత్సరాల నుండి అక్కడ నివాసితున్నారని వారికి ఇప్పటికే భూదాన బోర్డు పట్టాలను జారీచేసిందని అక్కడికి ఇటీవలే వెళ్ళి నిజనిర్ధారణ చేసిన సంఘాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ భూములను ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. భూదాన్ భూములను ప్రభుత్వం ఎవరికి కేటాయించలేదని అవి అర్బన్ పార్కుకు చెందినవని అధికారులు పేర్కొంటున్నారు.
స్థలాన్ని ఖాళీచేసి వెళ్ళిపోవాలని ఒత్తిడిచేస్తూ ప్రభుత్వ రెవిన్యూ, పోలీసు అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు రావటంతో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ గారి నేతృత్వంలో 10మంది ప్రజా సంఘాల ప్రముఖులతో కూడిన ఒక నిజనిర్ధారణ కమిటీ 17/2/2026న ఈ కాలనీని సందర్శించింది.
నిజనిర్ధారణ చేసిన ఓపిడిఆర్ జనరల్ సెక్రెటరీ డి. విజయేందర్ రావు రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి రాసిన మెమోరాండం లో అనేక విషయాలు ప్రస్తావించారు. వెలుగుమట్ల గ్రామంలో నివాసయోగ్యమైన భూదాన్ భూమిని 2013 సంవత్సరంలో గుర్తించి భూదానబోర్డు అధికారులను 2000 మంది అభ్యర్థించారు. ఇళ్ల స్థలాల సమస్య తీవ్రతను గుర్తించిన బోర్డు 2014 సం||లో గ్రామశివారులోని 147, 148, 149 సర్వే నెంబర్లలోని 62 ఎకరాల 7 కుంటల భూదాన్ భూమిలో ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున 1896 కుటుంబాలకు లే-అవుట్ చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. 2014 నుంచి 2018 సంవత్సరం వరకు ప్రజలు అనేక పర్యాయాలు రెవిన్యూ శాఖ అధికారులకు విన్నవించినా, వారు ఈ భూమికి సరిహద్దులు నిర్ణయించి ప్రజలకు ఇళ్లస్థలాలు కేటాయించలేదు. ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి 2018 సంవత్సరంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు.
దీనిపై 2018 నవంబరులో కోర్టు ఇళ్లు కట్టుకోవచ్చునని ప్రజలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు ఆర్డరు వచ్చినప్పటికీ రెవిన్యూవారు సహకరించలేదు. దాంతో ప్రజలు భూదానబోర్డు ఇచ్చిన లే-అవుటు ప్రకారం నివాసాలు ఏర్పరచుకొని (“వినోబా నవోదయ కాలనీ') నివసించ సాగారు. రెవిన్యూ అధికారులు ఇళ్లను తొలగించటానికి ప్రయత్నించటంతో తిరిగి ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. 2019లో హైకోర్టు నుండి "నాట్ టు డిమాలిష్" అనే ఆర్డరు వచ్చింది.
“అప్పటి నుండి అనేకమార్లు విజ్ఞప్తులు చేసినా నివాసముంటున్న సుమారు 1,000 కుటుంబాలకు తాగునీరు, కరెంటు, రోడ్లు వగైరా కనీస సదుపాయాలు కల్పించాలని చెప్పినా సంబంధిత అధికారులు పెడచెవిన పెట్టారు. పలుమార్లు ఊరేగింపులు, ప్రదర్శనలు చేశారు. ఆయా శాఖలు పట్టించుకోకపోవటంతో ప్రజలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 2019 సెప్టెంబరు 18నాడు ప్రజలకు మంచినీరు, కరెంటూ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇన్ని ఆర్డర్లు వున్నప్పటికీ ఈ కనీస సౌకర్యాలు కల్పించకుండా రెవిన్యూ, పోలీసు శాఖలు ప్రజలపై బెదిరింపులు కొనసాగిస్తున్నాయి,” అని విజయేందర్ రావు చెప్పారు.
ఈ విషయంపై రెవెన్యూ మంత్రికి రాస్తూ వెలుగుమట్ల గ్రామంలో ఉన్నది భూదాన భూమి. ప్రైవేట్ భూమి కాదు. 1997లో ప్రభుత్వం భూదాన భూమిని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకై ఇవ్వవచ్చని ఒక జీఓ జారీ చేసిందని విజయేందర్ రావు గుర్తు చేశారు.
కమిటీ తన నివేదికలో భూదాన్ భూమిని అమ్మే, కొనే అధికారం ఎవరికీ లేదు. ఎవరైనా కొన్నా చెల్లదు. కేవలం భూమి లేనివాళ్లకు, ఇళ్లస్థలాలు లేనివాళ్లకు ఇవ్వడానికే వినియోగించాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని రెవిన్యూవాళ్లు మొత్తం ఈ 62 ఎకరాల 7 కుంటలకు కొలతలు వేసి అన్యాక్రాంతం కాకుండా కాపాడి ప్రజలకు వెంటనే అప్పజెప్పాలి డిమాండ్ చేసింది. అక్కడ నివసిస్తున్న వెయ్యి కుటుంబాలకు నీటి వసతి, కరెంటు లేకపోవటంతో విద్యార్థులు చదువుకోలేక పోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ వసతులను కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు.
ఈ సౌకర్యాలు కల్పించమని 12 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆందోళనలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోకపోవడం గత ప్రభుత్వాల ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనంగా ఉంది. కనీసం ఈ ప్రభుత్వమైనా ఈ సమస్యలు సత్వరమే పరిష్కరించవలసిందిగా మా కమిటీ కోరుతున్నది వారు ప్రకటనలో కోరారు.
ఈ ఇళ్లస్థలాల కమిటీ సభ్యులు నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు భూదాన బోర్డు ఇళ్ళ స్థలాలను మంజూరు చేస్తూ జారీచేసిన ప్రొసీడింగ్సును, వివిధ ప్రభుత్వాధికారులకు ప్రజలు పెట్టుకున్న అనేక దరఖాస్తులను, 1954 నుండీ ఈ భూమి భూదానభూమి అని నమోదు చేయబడి వున్న పహాణీ రికార్డుల నకళ్ళను, ఇది భూదానభూమి అని అంగీకరిస్తూ, ఇందులో ఈ ప్రజలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసినట్లుగా ధృవీకరిస్తూ ఖమ్మం తహసీల్దారు మరియు భూదాన బోర్డు వారికీ జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాల రికార్డులను, ఈ ప్రజల నివాసాలపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకోకూడదనీ, ఈ భూముల నుండి వీరిని ఖాళీ చేయించరాదనీ, స్టేటస్-కోను పాటించాలనీ, కరెంటు వగైరా సదుపాయాల్ని కల్పించాలనీ హైకోర్టు అనేకసార్లు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన పత్రాలను, ఇతర సంబంధిత రికార్డులనూ - చూపటం జరిగింది. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆ రికార్డులను వివరంగా పరిశీలించటం జరిగిందని కమిటీ తెలుపుతూ వారి సమస్యలను మానవతాదృక్పథంతో చూడాలని ప్రకటనలో కోరారు.

