మల్గిలో ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు బెదిరింపు
x

మల్గిలో ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు బెదిరింపు

ముఖ్యమంత్రికి రైతు సంఘాల ఫిర్యాదు


ప్రజాభిప్రాయ సేకరణకు ముందు పోలీసులు బెదిరింపులకు దిగటం అప్రజాస్వామికమని ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాలు పేర్కొన్నాయి.

సంగారెడ్డి జిల్లాలో మల్గి గ్రామంలో ప్రతిపాదిత ఫార్మాల్డిహైడ్, రెసిన్ తయారీ పరిశ్రమకు ప్రజాభిప్రాయ సేకరణకు ముందు పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని వారి పరిపాలనా జోక్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ పరిశ్రమ వల్ల గాలి, నీరు, వ్యవసాయం, ప్రజల జీవనోపాధులు మరియు ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

గత వారం రోజులుగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) సభ్యులు, పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు మరియు సామాజిక కార్యకర్తలతో కలిసి, ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని కరపత్రాలు మరియు గ్రామ స్థాయి సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. . ఈ కార్యక్రమాలు ప్రభావిత గ్రామస్తుల అభ్యర్థన మేరకే చేపట్టినవని సంఘాలు వెల్లడించాయి.

TPJAC జిల్లా కన్వీనర్ మరియు పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు వై. అశోక్ కుమార్ గారిని, జహీరాబాద్ డీఎస్పీ సంప్రదించి గ్రామాలకు వెళ్లవద్దని, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కార్యకర్తలు ఆరోపించారు. ఇది పౌర సమాజ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నంగా, శాంతియుతంగా చట్టబద్ధంగా జరుగుతున్న చర్యలను అడ్డుకునే చర్యగా వారు అభివర్ణించారు.

ఈ నేపథ్యంలో, ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి గ్రామస్తులు మరియు కార్యకర్తలపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా చూడాలని, జిల్లా సివిల్ మరియు పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆ వినతిలో కోరారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లే కార్యకర్తలపై ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లేదా ఇతర బలవంతపు చర్యలు చేపట్టబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణలు ప్రభావిత ప్రజలు తమ అభిప్రాయాలను అధికారికంగా నమోదు చేయడానికి ఉన్న కీలక ప్రజాస్వామ్య వేదికని పౌర సమాజ సంఘాలు పేర్కొన్నాయి. భయ వాతావరణాన్ని సృష్టించడం లేదా ప్రజలు పాల్గొనడాన్ని పరిమితం చేయడం ప్రజాకేంద్రీత పాలన సూత్రాలను దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక పత్రికా కథనాలు కూడా ఈ ప్రతిపాదిత పరిశ్రమపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. కాలుష్య, రసాయన ప్రమాదాలు, తగిన అత్యవసర మౌలిక వైద్య వసతుల లేమి వంటి అంశాలపై గ్రామస్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి.

ప్రజాభిప్రాయ సేకరణను న్యాయంగా, పారదర్శకంగా మరియు భయరహితంగా నిర్వహించాలని కోరుతూ ఈ పోరాటానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC), నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (NAPM) – తెలంగాణ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్, హ్యూమన్ రైట్స్ ఫోరం, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR), నేషనల్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ (NACEJ) – తెలంగాణ, దళిత్ బహుజన్ ఫ్రంట్, అక్షరం, అలీఫా మరియు వాయిస్ ఆఫ్ ది పీపుల్ వంటి ప్రజాసంఘాలు మరియు పౌర సమాజ సంస్థలు మద్దతు ప్రకటించాయి.

Read More
Next Story