'నిరుద్యోగం పెరిగిపోతుంటే దేశం ఎలా వెలిగిపోతుంది?'
కేంద్రంపై పరకాల ప్రభాకర్ ప్రశ్నల వర్షం వర్షం కురిపించారు. నిరుద్యోగం పెరిగిపోతుందటే దేశంలో ఎలా మెరిసిపోతుందో చెప్పాలని నిలదీశారు..
‘‘నిరుద్యోగం పెరిగిపోతుంటే దేశం ఎలా వెలిగిపోతుంది? ఎలా మెరిసిపోతుంది? ఉచిత బియ్యం ఇచ్చారంటే దేశంలో ఆకలి లేదని ఎలా చెపుతారు? ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు వాటిని ఎందుకు సీజ్ చేయరు? ప్రతి స్వతంత్ర వ్యవస్థ మీతో రాజీపడిందంటే వాటిపై ఎంత ఒత్తిడి చేశారు? మేక్ ఇన్ ఇండియా కాదు షటప్ ఇండియాగా ఎందుకు మారింది?’’ అంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల మెషిన్ గన్ ప్రయోగించారు.
‘దేశం నిజంగా వెలిగిపోతుందా???’ అన్న అంశంపై సోమవారం సాయంత్రం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అక్కడే జరిగిన సదస్సులో పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. శాసనమండలి మాజీ ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పరకాల ప్రభాకర్ ప్రసంగించిన అనంతరం ప్రేక్షకులు వేసిన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. వారి ప్రసంగ సారాంశం వారి మాటల్లోనే ఇలా..
‘‘మన్ కీ బాత్ పైన నాకు విశ్వాసం లేదు. ప్రశ్నలు సమాధానాలుంటే బాగుంటుంది. కొన్ని గంభీర విషయాలు చర్చించాలి. ‘భారత దేశం వెలిగిపోతోంది, మెరిసి పోతోంది.’ అని కొందరు పెద్దలు, చెప్పారు. కొన్ని పత్రికలు రాశాయి. భారతదేశం నిజంగా వెలిగి పోతుంటే, నిజంగా మెరిసిపోతుంటే సంతోషించే వారిలో నేనున్నాను. దేశం కోసం జైలు కెళ్ళిన వారి కడుపున పుట్టాను. దేశం బాగుందని అబద్ధాలు ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు. దేశం వెలిగిపొయేలా, మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అంతా బాగుందని భజన చేసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి ! ఎక్కడ సమస్య ఉందో, ఏది నా దేశాన్ని కుంగదీస్తోందో చెప్పడం నా బాధ్యత.
అమెరికాలో ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ అక్కడికెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ‘ప్రతిపక్షాలు 90 సార్లు నన్ను తిట్టిపోశాయి’ అన్నారు. ‘కోవిడ్ సమయంలో ఎంత మంది మృతి చెందిందీ లెక్కలు మాత్రం ఉండవు. ఎంత మంది నిరుద్యోగులైందీ లెక్కలు లేవు. ఎంత మంది కూలీలు నడుచుకుంటూ తమతమ గ్రామాలకు వెళ్ళారంటే లెక్కలు లేవు. కానీ ప్రతిపక్షాలు ఎన్ని సార్లు తనను తిట్టిందన్న లెక్కలు మాత్రం ఉంటాయి.
స్వాతంత్ర్యోద్యమంతో అస్సలు సంబంధం లేనివారు తమని తాము దేశ భక్తులుగా ప్రచారం చేసుకుంటూ చలామణి అవుతున్నారు. దేశానికి 2014లోనే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇదీ న్యూ ఇండియా ! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు 35 వేల నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చారు. కనీస విద్యార్హత 8వ తరగతి. 35 వేల ఉద్యోగాలకు కోటి 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే దేశం ఎంత వెలిగిపోతోందో చూడండి !
ఇజ్రాయిల్‌లో పాలస్తీనా వారిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి మన దేశంలోని ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రిక్రూట్ మెంట్ సెంటర్లు పెట్టి భర్తీ చేసుకున్నారు. ఆ ఉద్యోగాలకు నిరుద్యోగులు క్యూ కట్టారు. ‘ఇజ్రాయిల్‌లో యుద్ధం జరుగుతోంది కదా అక్కడికి ఎందుకు వెళుతున్నారు?’ అని పత్రికల వారు ప్రశ్నిస్తే, ‘ఉద్యోగాలు లేకుండా ఇక్కడ చచ్చేకంటే బతికినంత కాలం ఉద్యోగం చేయడం మంచిది’ అని వారి నుంచి సమాధానం వచ్చింది.
ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు చెందిన యువకుడి శవం వచ్చింది. రష్యా తరపున ఉక్రెయిన్‌పై యుద్దం చేయడానికి ఇక్కడి నుంచి యువకులను తీసుకెళుతున్నారు. గాజాకు, ఉక్రెయిన్‌కు ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. నిరుద్యోగుల్లో యువకులు 24 శాతం మంది ఉన్నారు. నిరుద్యోగుల్లో 20 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండే వారు 40 శాతం మంది ఉన్నారు. మొత్తం నిరుద్యోగుల్లో చదువుకున్న వారి సంఖ్య 82 శాతం ఉంది. దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. నిరుద్యోగంలో ఎమెన్, లిబియా వంటి దేశాల సరసన మనం ఉన్నాం. బంగ్లాదేశ్ కంటే కూడా దారుణంగా ఉన్నాం. అయినా భారతదేశం వెలిగిపోతోంది.
ఆర్థిక స్థితిపై కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఆ శ్వేతప్రతం కోసం నేను ఎదురు చూడలేదు. ప్రతివారం, ప్రతి రోజూ నాకు శ్వేతపత్రం దొరుకుతూనే ఉంది. తొంభై రూపాయలున్న అల్లం ఇప్పుడు 115 రూపాయలైంది. (తిరుపతిలో 150 రూపాయలని ప్రేక్షకులన్నారు). పెట్రోల్ వందరూపాయలైతే ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు 112 రూపాయలు దాటితే ప్రజలు మర్చిపోయారు. ముప్పై అయిదు వేల ఉద్యోగాలకు కోటి 25 లక్షల మంది పోటీపడ్డారంటే ఇంతకు మించిన శ్వేతప్రతం ఏం కావాలి?
‘ఒకప్పుడు భారతదేశంలో లెక్కలు ప్రామాణికంగా ఉండేవి. ఇవాళ నమ్మశక్యంగా లేవు’ అని వంద మంది ఆర్థిక శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. భారతదేశం నిజంగా వెలిగిపోతుంటే, మెరిసిపోతుంటే ప్రతి ఏడాది లక్ష పాతిక వేల మంది పౌరులు భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? విదేశాలకు వెళ్ళిపోయే వారి సంఖ్య 2014 నుంచి ఎందుకు పెరిగిపోతోంది? 2014లో లక్ష 29 వేలమంది, 2016లో లక్ష 40 వేల మంది, 2021లో లక్ష 60 వేల మంది, 2022లో రెండు లక్ష ల 25 వేల మంది తమ పాస్ పోర్టులను భారత ప్రభుత్వానికి అప్పగించేసి, పౌరసత్వాన్ని వదిలేసి విదేశాలకు ఎందుకు వెళ్ళిపోయారు?
అమెరికాకు అక్రమంగా వలస వెళ్ళిన వారి సంఖ్య భారత దేశం నుంచే ఎక్కువగా ఉంది. మన దేశం నుంచి గత ఏడాదే 95 వేల మంది అక్రమంగా అమెరికాకు వెళ్ళిపోయారు. ఒక్క గుజరాత్ నుంచే 25 వేల మంది అక్రమంగా అమెరికాకు వెళ్ళిపోయారంటే దేశం ఎంతగా వెలిగిపోతోందో, మెరిసిపోతోందో చూడండి.
ఉపాధి హామీ పథకానికి గత ఏడాది బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఆరు నెలలకే అయిపోయాయంటే గ్రామీణ భారతం ఎంతగా వెలిగిపోతోందో చూడండి. వ్యవసాయ రంగం, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారి ఆదాయం పెరగలేదు. కొన్ని రాష్ట్రాల్లో పెరుగుదల కనిపించింది కానీ, అది 2 శాతం మాత్రమే పెరిగింది. ద్రవ్యోల్భణం 7.1 నుంచి 6.9 శాతానికి పడిపోయిందని హెడ్ లైన్ మేనేజ్ మెంట్ ద్వారా చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆదాయం 2 శాతం పెరగడం గొప్పా? ద్రవ్యోల్భణం o . 2 శాతం పడిపోవడం గొప్పా?
దేశంలో 125 మంది బిలియనీర్లుంటే వారి సంఖ్య 165కు పెరగడం ఎంత గొప్ప విషయం!? నిరుద్యోగం, ధరలు పెరిగిపోతున్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు చాలా మంది వెళ్ళిపోతున్నారు. మన పారిశ్రామిక వేత్తలు మాత్రం చాలా గొప్పగా ఉందని పొగిడేస్తున్నారు. 2014కు ముందు డొ మెస్టిక్ పెట్టుబడి 31 శాతం ఉంటే, ఇవాళ 19 శాతానికి పడిపోయింది. దేశం వెలిగిపోతోందనుకో వాలా? మెరిసిపోతోందనుకోవాలా?
పారిశ్రామిక వేత్తలకు పాతిక లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశామన్నారు. 30 శాతం ఉన్న కార్పొరేట్ రంగం పన్నును 25 శాతానికి తగ్గించేశామన్నారు. రుణాలు మాఫీ చేసినా, ప్రోత్సాహకాలు ఇచ్చినా పెట్టుబడులు పెరగడం లేదు. ఏ రకంగా చూసినా దేశం ఇబ్బందుల్లో ఉంది. ఒక్క శాతం ప్రజలు ఆదాయంలో 25 శాతం మాత్రమే పొందుతున్నారు. ఒక్క శాతం ఉన్న వారి దగ్గర 45 శాతం ఆస్తులున్నాయి. బ్రిటిష్ పాలనలో కూడా ఇంత అసమానతలు లేవు.
‘నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది ఎలా అవుతుంది?’ అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర్ అంటారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది కానప్పడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని ఎందుకు చెపుతారు? ‘అసమానతలు మంచికే’ అంటాడు మరొకాయన. ఆర్థికంగా దేశం ఇంత గా నలిగిపోతుంటే, కుమిలి పోతుంటే వెలిగిపోతోందని, మెరిసిపోతోందని ఎలా చెపుతారు?
భారత దేశం వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. బ్రిటన్ను దాటిపోయి, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అంటున్నారు. ప్రధాని మాత్రం 2040 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంటున్నారు. మనది ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే, బ్రిటన్‌ను అధిగమించేసినట్టయితే, అభివృద్ధి చెందిన దేశం కావడానికి 2040 వరకు ఎందుకు ఆగాలి? దేశంలో ఆకలి సమస్యలేకుంటే అయిదేళ్ళకు ఉచిత బియ్యం ఎందుకిస్తున్నారు? ఎనభై రెండు కోట్ల మందికి ఉచిత బియ్యం ఇచ్చారంటే దేశంలో ఆకలి సమస్య ఎందుకు ఉంది? మనకు సబ్సిడీకి కానీ, ఉచితంగా కానీ సిలిండర్లు ఇస్తారట ! వాళ్ళకు నాలుగు ఎయిర్ పోర్టులు ఇస్తారు !
ఆర్థిక వ్యవస్థలో అమెరికా తరువాత చైనా, జర్మనీ, జపాన్ ఉన్నాయి. తరువాత మన దేశమే. మనం పోల్చుకోవలసింది ఆంద్రప్రదేశ్ అంత ఉండే బ్రిటన్‌తో కాదు, వైశాల్యంలో, జనాభాలోను సరితూగగల చైనాతో పోల్చుకోవాలి. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అన్నారు. ఇప్పుడు షటప్ ఇండియా అంటున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్ ధరలు మనకు ఎందుకు పెరిగాయి?
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటకుల సంఖ్య 30 లక్షల నుంచి కోటి 40 లక్షలకు పెరిగిందంటున్నారు. ఇదివరకు అమరనాథ్ యాత్రికుల సంఖ్యను దీంట్లో కలిపే వారు కాదు. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా కలిపేస్తున్నారు. ఐటీ, సీబీఐ వంటి సంస్థలు ఇదివరకు 5 శాతం దుర్వినియోగం అయితే, ఇప్పడు 95 శాతం దుర్వినియోగం అవుతున్నాయి.
ఎలక్టోరల్ బాండ్లు 2018 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం స్టే కూడా ఇవ్వలేదు. ఇప్పుడు విచారణకు వచ్చింది. ‘రాజకీయ పార్టీలు ఎవరి నుంచి చందాలు తీసుకున్నారనే విషయం తెలుసుకునే హక్కు భారత ప్రజలకు లేదు.’ అని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించింది. లాభాల్లో లేని కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీలు, రెండేళ్ళ క్రితం పెట్టిన కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొన్నారంటే అర్థం ఏమిటి? అంత క్లీన్‌గా ఉన్న వీళ్ళు ఎలక్టోరల్ బాండ్లు ఎవరికి ఇచ్చారన్నది దాచడం ఎందుకు? జుడీషియల్ ఎంక్వయిరీ వేయమనండి. అది కూడా తేలిపోతుంది.
ఆర్బీఐ స్వతంత్ర సంస్థ. అది కూడా నిబంధనలను సడలించిందంటే అర్థం ఏమిటి? ప్రతి వ్యవస్థా రాజీ పడిందంటే వాటిపై ఎంత ఒత్తిడి చేశారు? ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీం కోర్టును కూడా పక్కన పెట్టారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమనప్పుడు వాటిని సీజ్ చేయాలి కదా! ’’ అంటూ పరకాల ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా ప్రశ్నలను సంధించారు.