కొండగట్టు సేవలో తరించిన పవన్
x

కొండగట్టు సేవలో తరించిన పవన్

కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకారం అందించిన ఆంధ్ర డిప్యూటీ సీఎం.


కొండగట్టు ఆంజనేయ స్వామి సేవలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తరించారు. శనివారం ఆయన అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్బంగానే ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల టీటీడీ నిధులను అందించారు. ఆలయంలో నిర్మించనున్న వసతి గృహానికి భూమిపూజ చేశారు. 96 గదులతో ధర్మశాల, దీక్ష విరమణ మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు ఆలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని శ్రీ పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా కొలుస్తారు. 29 జూన్ 2024న ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడారు. ఆ సమయంలో కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అందుకు సహకరిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. అదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. పవన్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఇదే అంశంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కూడా పవన్ చర్చించారు. అందుకు అంగీకారం తెలిపిన టీటీడీ బోర్డు రూ.35.19 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో చేపట్టనున్న సత్రం భూమిపూజ కోసం శనివారం పవన్ కల్యాణ్.. కొండగట్టుకు వచ్చారు.

ఆలయ దర్శనం అనంతరం పవన్ కల్యాణ్.. తెలంగాణ జనసేన నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.

Read More
Next Story