హెటిరో కంపెనీని మూసేస్తామని కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరిక
x

హెటిరో కంపెనీని మూసేస్తామని కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరిక

"వ్యర్థ పదార్ధాలేవీ విడుదల చేయనపుడు కంపెనీలోకి ఎందుకు అనుమతించడం లేదు."


కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలను హెటిరో కంపెనీ పాటించటం లేదని దానిపై చర్యలు తీసుకునే వరకు మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని తెలంగాణ ప్రజా జె.ఏ.సి (TPJAC), కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (KVPC) ప్రకటించాయి.

దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి తమకు సంబంధం లేదని, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని హెటెరో డ్రగ్స్ యాజమాన్యం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) జనవరి 1, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ ప్రజా జె.ఏ.సి (TPJAC), కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (KVPC) నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేసి ఈ మేరకు తెలియచేశారు. బోర్డు యిచ్చిన ఉత్తర్వులో (Order No. RCP-30/TGPCB/TF/HO/2026-29) కంపెనీ బోర్డు విధించిన షరతులను (Consent Conditions), జూలై 2021, జనవరి 2023, మే 2025 లలో జారీచేసిన నాటి ఆదేశాలను బేఖాతరు చేస్తోందని స్పష్టంగా పేర్కొంది.

కాలుష్య నియంత్రణ బోర్డు కంపెనీ లోని ZLD (సున్నా వ్యర్థాల విడుదల) వ్యవస్థ పనిచేయటం లేదని, ATFD మరియు బయోలాజికల్ ETP ప్లాంట్ల నుండి వెలువడుతున్న దుర్వాసనను అరికట్టడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని బయటపెట్టింది. గాలి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన స్క్రబ్బర్లను సమర్థవంతంగా నిర్వహించడం లేదని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ధారించి, ఆదేశాలను పాటించకపోతే ఎయిర్ యాక్ట్ 1981 సెక్షన్ 31(A) కింద ఎటువంటి నోటీసు లేకుండానే పరిశ్రమను మూసివేస్తామని (Closure of the Industry) బోర్డు తన ఉత్తర్వుల్లో హెటెరో యాజమాన్యాన్ని తీవ్రంగా హెచ్చరించింది.

బోర్డు కంపెనీని మూసివేస్తామని హెచ్చరిస్తుంటే తహసీల్దార్ కార్యాలయంలో రహస్యంగా రైతులకు రు. 12 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం వెనుక ఆంతర్యం ఏమి అని టీపీజేఎసి ప్రశ్నిస్తోంది. “కంపెనీ లో నిబంధనల ప్రకారం సున్నా వ్యర్థాల విడుదల ప్లాంటు పనిచేస్తుంటే బహిరంగ తనిఖీకి ఎందుకు ముందుకు రావటం లేదని,” ప్రజా జె.ఏ.సి అధ్యక్షులు వై. అశోక్ కుమార్ తమ ప్రకటనలో నిలదీశారు.

బోర్డు జనవరి 1న జారీచేసిన తన ఉత్తర్వులో వివిధ వార్తా పత్రికలు రాసిన రిపోర్టులతో పాటు, సిపిఎం పార్టీ, సంగా రెడ్డి కలెక్టర్ పంపిన కాలుష్య వార్తా కథనాలు, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంది. వీరితో పాటు ప్రముఖ కాలుష్య వ్యతిరేఖ కార్యకర్తలైన డా. పి.ఎల్.ఎన్. రావు, పర్యావరణ సామాజిక కార్యకర్త, డా. జి. కొండల్ రావు, చీఫ్ ఇంజనీర్, (పబ్లిక్ హెల్త్), కన్నెగంటి రవి, కాలపాల బాబు రావు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఇచ్చిన ఫిర్యాదు, కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శన పై ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈ ఆర్డర్ జారీచేస్తున్నటు బోర్డు ప్రకటించింది. నవంబర్ 14న తాము పరిశ్రమను పరిశీలించి నమోదు చేసిన వివిధ ఉల్లంఘనలను అది ఊటంకించింది.

వీటితో పాటు బోర్డు కోరిక మేరకు నల్లకుంట చెరువును పరిశీలించిన ఐఐటీ-హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. డీ.వి. సాయి ప్రణీత్, యిచ్చిన నివేదిక సేంద్రీయ పదార్థాలు, కొన్ని పోషకాలు, సల్ఫైడ్, తక్కువ లోతు గల నీటిలో కాంతి ప్రసరణ, ప్రాణవాయువు లేకపోవటంతో పర్పుల్ సల్ఫర్ బాక్టీరియా పెరిగేందుకు అవకాశం ఏర్పడిందని దీని వలన చెరువులో నీళ్ళు పర్పుల్ పింక్ రంగులోకి మారాయని చెప్పింది.

ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే నల్లకుంట చెరువు క్రిములకు నిలయంగా, చెడు వాసనను వేదజల్లుతూ, నీటి నాణ్యతను దెబ్బతీసి దీర్ఘ కాలం పర్యావరణ హాని జరుగుతుందని, డా సాయి ప్రణీత్ తన నివేదికలో చెప్పారు.

బోర్డు ఉత్తర్వుల నేపధ్యంలో తెలంగాణ ప్రజా జె.ఏ.సి, కేవీపీసీ కొన్ని డిమాండ్లు ముందు పెడుతూ పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునే వరకు మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించాయి. జనవరి 11న నిర్వహించే ‘మహా ర్యాలీ’ కి టీపీజేఎసి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Read More
Next Story