
మూతపడుతున్న పెట్రోలు బంకులు(వీడియో)
కొన్ని పెట్రోల్‌బంకుల్లో సిబ్బంది పెట్రోల్ కోసం వస్తున్న వాహనాలను నోస్టాక్ అనిచెప్పి తిప్పి పంపేస్తున్నారు
హైదరాబాద్ నగరంలోని కొన్నిచోట్ల పెట్రోలు బంకుల దగ్గర క్యూలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోలుకు కొరత మొదలైందో లేకపోతే పెట్రోలు బంకులు మూతపడబోతున్నాయనే భయమో తెలీదుకాని వాహనాల యజమానులు మాత్రం బంకుల దగ్గర పెట్రోల్ కోసం బారులు దీరుతున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున తేడాలేకుండా వాహనాల యజమానులు బంకులదగ్గర క్యూలైన్లు కట్టడంతో విపరీతమైన రద్దీపెరిగిపోతోంది. ఒకవైపు కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వమేమో పెట్రోలు, డీజల్ కు కొరతలేదని మొత్తుకుంటున్నాయి. మరోవైపేమో వాహనాల యజమానుల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇదేసమయంలో కొన్ని పెట్రోల్‌బంకుల్లో సిబ్బంది పెట్రోల్ కోసం వస్తున్న వాహనాలను నోస్టాక్ అనిచెప్పి తిప్పి పంపేస్తున్నారు. దాంతో పెట్రోలో ఎప్పుడు అయిపోతుందో అన్నటెన్షన్ పెరిగిపోతుండటంతో వాహనాల యజమానులు తమ బండ్లలో పెట్రోలు కొట్టించుకోవటమే కాకుండా క్యాన్లను తీసుకొచ్చి వాటిల్లో కూడా నింపుకుంటున్నారు.
వాహనాల యజమనుల ఆందోళనలు, టెన్షన్ కారణంగానే నగరంలో పెట్రోల్, డీజల్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోందని చెప్పాలి. ప్రజల్లోని ఆందోళనలకు ప్రభుత్వాలు కూడా సరైన పద్దతిలో సమాధానాలు చెప్పటంలేదు. అందుకనే ప్రభుత్వాల మాటలను జనాలు నమ్మటంలేదు. ఫలితంగా చాలా పెట్రోల్ బంకుల ముందు చాంతాడంత క్యూలు కనబడుతున్నాయి. నగరంలోని అమీర్ పేట్, సంజీవరెడ్డి నగర్, పంజాగుట్ట, లక్డీకాపూల్, రాజేంద్రనగర్, మియాపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట లాంటి అనేక బంకుల దగ్గర విపరీతమైన క్యూలు కనబడుతున్నాయి. వాహనాల యజమనాలు ఆందోళనలు, కొన్ని బంకుల దగ్గర సిబ్బంది పెట్రోల్ స్టాక్ లేదని చెప్పటం చూస్తుంటే తొందరలోనే నగరంలోని పెట్రోలు బంకులు మూతపడక తప్పదా అనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి.
#hyderabad లో #Petrol కు హై-డిమాండ్. కిటకిట లాడుతున్న బంకులు. పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనలో వినియోగదారులు. ఇరాన్ యుద్ధంతో ఇక్కడ ఇక్కట్లు తప్పట్లేదే. ఇదిగో హైదరాబాద్లో పలు పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి.#Petrolpanic #Hyderabadpetrol pic.twitter.com/cHNRaZYRwY
— Subbu (@Subbu15465936) March 25, 2026
ఒక అంచనా ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు వెయ్యి పెట్రోల్ బంకులున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెపీసీఎల్, రిలయన్స్ సంస్థ తరపున పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. పెట్రోల్ బంకుల డీలర్ల సంఘం నేతల సమాచారం ప్రకారం ప్రతిరోజు నగరం పరిధిలో సుమారు 25 లక్షల లీటర్ల పెట్రోలు, 30 లక్షల లీటర్ల డీజల్ వాడకం ఉంటుంది. పెట్రోలు, డీజల్ రెండూ కలిపి సుమారు 50 లక్షల లీటర్ల వాడకం రోజుకు ఉంటుందని అనుకోవచ్చు. అలాగే తెలంగాణ మొత్తంమీద రోజువారి వాడకం పెట్రోల్ 85 లక్షల లీటర్లు, డీజల్ 1.5 కోట్ల లీటర్ల వాడకం ఉంటుందని సమాచారం.
పెట్రోల్ కొరతలేదు
తెలంగాణలో పెట్రోల్, డీజల్ కు ఎక్కడా కొరతలేదని డీలర్ల సంఘం ప్రకటించింది. రవాణాలో ఎక్కడైనా జాప్యం జరిగితే పెట్రోల్, డీజల్ రావటం ఆలస్యం అవుతుందేమో కాని ఆయిల్ దొరక్క కొరత అన్నది లేదని సంఘం చెప్పింది. రోజుకు 3 వేల ట్యాంకర్లలో పెట్రోల్, డీజల్ సరఫరా అవుతోందని పెట్రోల్ బంకుల డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ చెప్పారు. పెట్రోల్, డీజల్ దొరకవేమో అన్న ఆందోళనలు అవసరంలేదని జనాలకు రాజశేఖర్ భరోసా ఇచ్చారు. ఆయిల్ సరఫరాకు ట్యాంకర్లు, కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, పెట్రోలో, డీజల్ అవసరమైనంత అందించేందుకు బంకులు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు చెప్పారు.

