అతి త్వరలో తెలంగాణకు మోదీ..!
x

అతి త్వరలో తెలంగాణకు మోదీ..!

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర నాయకత్వం.


ప్రధాని నరేంద్ర మోదీ... తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆయన పర్యటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ బలం, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయం వంటి విషయాలపై మోదీ ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర బీజేపీ నేతలతో మోదీ ప్రత్యేక సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం ఎలా చేయాలన్న ప్రణాళికలపై కూడా మోదీ ఫోకస్ పెట్టొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగానే మోదీని తెలంగాణకు కూడా రప్పించేలా తెలంగాణ బీజేపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగానే బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మోదీతో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

స్థానిక నేతలకు మోదీ పర్యటనపై రాష్ట్ర నాయకులు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‌ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగానే ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Read More
Next Story