
ఏపీకి నల్లమలసాగర్ శాపమా? వరమా?
రాయలసీమ కరువును తగ్గిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా, నిపుణులు మాత్రం ఇది నీటి సమస్యలను మరింత క్లిష్టం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు
రాయలసీమ కరువు నివారణ పేరుతో ప్రతిపాదించిన పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కొత్త రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద ప్రాజెక్ట్ పరిశీలన అంశం చర్చకు రావడంతో వివాదం మళ్లీ ముదిరింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీటి అంశం ప్రధానంగా నిలిచింది. ఇప్పుడు అదే అంశం మరోసారి వేడెక్కింది. దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించాలని యోచిస్తోంది. ఈ నీరు వరద జలాలేనని ఏపీ చెబుతోంది. దీని ద్వారా రాయలసీమ కరువును తగ్గించగలమని వాదిస్తోంది.
అయితే తెలంగాణ ఈ ప్రాజెక్ట్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి, కృష్ణా నదీ నిర్వహణ బోర్డుల అనుమతులు లేకుండా ముందుకు వెళ్లడం సరికాదని పేర్కొంది. ముందుగా తన ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలని సూచించింది. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై స్పష్టత వస్తుందని తెలిపింది.
గోదావరి జలాల లభ్యత
సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌కు సంవత్సరానికి 1,499.9 టీఎంసీల నీటి వాటా ఉండేది. అప్పట్లో సీమ ఆంధ్ర ప్రాజెక్టులకు రాష్ట్ర విభజన అందులో ఏపీ వాటా 531.9 టీఎంసీలు ఇప్పటికే వినియోగంలో ఉంది. తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీలలో పూర్తి వినియోగం జరగలేదని నిపుణులు చెబుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారు, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వి. ప్రకాష్ అభిప్రాయం ప్రకారం, “తెలంగాణ వాటాగా 968 టీఎంసీల నీటిని ఉమ్మడి రాష్ట్రంలో లెక్క గట్టారు. వినియోగం ఆధారంగా ఇది నిర్ణయమైంది. కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిని కలిపే ఈ లెక్క తేల్చారు. తెలంగాణ తన వాటాను పూర్తిగా వినియోగిం పై స్పష్టత వస్తే ఏపీ తన వాటాలో ప్రాజెక్టులు నిర్మించుకోవడంపై తెలంగాణకు అభ్యంతరం ఉండదు,” అని చెప్పారు.
గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ ప్రకారం, ఏడాదికి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మొత్తం నీరు 3,396.9 టీఎంసీలు. ఏపీ ముఖ్యమంత్రి 3,100 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వెళుతోందని అన్నారు. కానీ అందులో ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు కేటాయించి ఇంకా వినియోగించని నీరు కూడా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి సముద్రంలోకి వెళ్లే సగటు నీరు సుమారు 1,138 టీఎంసీ లేనని వాళ్ళు చెబుతున్నారు. ఈ నీటిపై తెలుగు రాష్ట్రాలకు హక్కు లేదని నదీ జలాల నిపుణుడు శ్రీరామ్ వేదిరె అభిప్రాయపడ్డారు. కేంద్ర జల సంఘం నిర్ధారణ లేకుండా వరద జలాల పేరిట ప్రాజెక్టులు కట్టలేమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఇప్పటివరకు 400 టీఎంసీల కంటే తక్కువ నీటినే వినియోగించిందని ప్రకాష్ చెప్పారు. కాళేశ్వరం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే నీటి వాడకం 600 టీఎంసీలకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్ అంతర్రాష్ట్ర నదీ అనుసంధానం ప్రాజెక్ట్ కావడంతో కేంద్ర నిధులు 90 శాతం వరకూ లభించే అవకాశముందని ఆయన వివరించారు.
బచావత్ అవార్డు ప్రభావం:
మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మెరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ఏపీకి ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు. బచావత్ అవార్డు ప్రకారం, ఏపీ గోదావరి నీటిని కృష్ణ బేసిన్ తరలించి వినియోగిస్తే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కృష్ణా నీటిలో అదనపు వినియోగ హక్కులు ఉంటాయని గుర్తుచేశారు. ఈ పరిస్థితిలో ఎగువ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర 88 టీఎంసీలు అదనంగా నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ విడిపోయిన తర్వాత దాదాపు 80 టీఎంసీల వాటాను కోరే అవకాశముందని తెలిపారు. నల్లమలసాగర్ ప్రాజెక్ట్ సాంకేతికంగా కూడా సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్ట్‌లో భాగంగా 11 లిఫ్టులు ఉన్నాయని, నల్లమల అటవీ ప్రాంతంలో 26 కిలోమీటర్ల సొరంగం తవ్వకాన్ని తప్పించేందుకు బనకచర్ల నుండి కాకుండా నల్లమల సాగర్ కు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాధ్యా సాధ్యాలను గోదావరి నదీ నిర్వహణ బోర్డు పరిశీలిస్తుందని, ఆ తదనంతరం కేంద్ర జల సంఘం ఆమోదం అవసరమని అధికారులు చెబుతున్నారు. గోదావరి బోర్డు నివేదిక లేకుండా కేంద్రం ప్రొజెక్టుకు ముందుకు రాదని స్పష్టం చేశారు.
రిటైర్డ్ జర్నలిస్ట్ వి. శంకరయ్య ఇప్పటికే కేంద్ర నిధులతో జరుగుతున్న పోలవరం పూర్తికాలేదని గుర్తుచేశారు. మరో భారీ ప్రాజెక్ట్ నిర్మించే ఆర్థిక సామర్థ్యం ఆంధ్ర రాష్ట్రానికి ఉందా అనే ప్రశ్న ఆయన లేవనెత్తారు. నికరాజలాల పై స్పష్టమైన హామీలేకుండా కేంద్ర జల సంఘం ప్రాజెక్టులను ఆమోదించదని తెలిపారు.
నీటి వినియోగ సామర్థ్యంపై దృష్టి:
నీటి వినియోగ సామర్థ్యంపై కూడా చర్చ జరగాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఒక టీఎంసీ నీటితో 10,000 ఎకరాల వరి సాగు జరుగుతుండగా, ఏపీ తీరప్రాంతాల్లో అది 3,000 నుంచి 4,000 ఎకరాలకే పరిమితమని ఆయన గుర్తు చేశారు. కాలువ వ్యవస్థ సామర్థ్యం 30 శాతం మాత్రమేనని చెప్తూ, పంటల మార్పు, నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
చెరువులు, చెక్‌డ్యామ్‌లు, వర్షజల సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్ వంటి చర్యలే దీర్ఘకాలిక పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.100 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రాన్ని రీచార్జ్ చేయవచ్చని అంచనా వేశారు. వేల కోట్లు డ్యామ్‌లకు ఖర్చు చేస్తున్నా, నీటి సంరక్షణకు ఐదు శాతం కూడా వెచ్చించడం లేదని తెలిపారు.
భారీ ప్రాజెక్టుల వల్ల సాగుభూముల ముంపు, నిర్వాసితులు సమస్యలే కీలకమైన విషయాలుగా ముందుకొస్తున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వర్షాధార పంటలకు ఉద్దేశించినప్పటికీ, నీరు అందుబాటులోకి రాగానే రైతులు వరి సాగుకు మారతున్నారు. దీనివల్ల కాలువల చివరిన ఉన్న రైతులకు నీటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
మహారాష్ట్రలోని హివరే బజార్ గ్రామం నీటి సంరక్షణతో ఎలా అభివృద్ధి సాధించిందో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఆ దిశలో ఆలోచించాలి అన్నారు.

