హైదరాబాద్‌లో కల్తీ ఆహారం దందాపై పోలీసుల దాడులు
x

హైదరాబాద్‌లో కల్తీ ఆహారం దందాపై పోలీసుల దాడులు

స్వీట్లు, మాంసం, పెరుగు, పేస్ట్‌లలో నాసిరకం పదార్థాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో పలు కేసులు నమోదు.


హైదరాబాద్‌లో కల్తీ ఆహారం దందాపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. వరుస దాడుల్లో నాసిరకం పదార్థాలతో తయారైన ఆహార పదార్థాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. నగరం ఫుడ్‌కు ప్రసిద్ధి ఉన్నప్పటికీ, ఇటీవల కల్తీ భయం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రంజాన్ సీజన్‌లో హలీం తయారీ కేంద్రాలపై సరైన తనిఖీలు జరగకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లిలో నాసిరకం పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్న యూనిట్‌పై కేసు నమోదు చేశారు. అంబర్‌పేటలో హానికర రసాయనాలతో తయారు చేసిన 250 కిలోల పెరుగును స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్‌లో కుళ్లిపోయిన 300 కిలోల మటన్‌ను సీజ్ చేశారు. బయట రాష్ట్రాల నుంచి మాంసపు భాగాలను తీసుకొచ్చి నిల్వ చేసి బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ బయటపడింది. టప్పాచబుత్రకు చెందిన మహమ్మద్ జాఫర్ ఆలం ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేసి, కాలుష్యానికి గురయ్యేలా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళహాట్‌లో అక్రమంగా మాంసం విక్రయిస్తున్న మహమ్మద్ అఫ్రోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో స్వల్ప జరిమానాతో తప్పించుకున్న అతను మళ్లీ ఇదే దందా కొనసాగించినట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో పలు ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల గైర్హాజరీ, విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం సంబంధిత శాఖలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Next Story