మందుబాబులపై పోలీసుల కొరడా: రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్స్
x
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు (ఫొటో : ఎక్స్ పోస్టు/ ట్రాఫిక్ పోలీసు విభాగం)

మందుబాబులపై పోలీసుల కొరడా: రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్స్

హెల్మెట్ లేకుండా, మద్యం మత్తులో డ్రైవింగ్…ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు


తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 7,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.అందులోనూ మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, అతివేగం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలు ఏటా రెట్టింపు అవుతూ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలు ఎన్నో కుటుంబాలను తీరని శోకంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ చైతన్య తనిఖీలు, హెల్మెట్ అవేర్ నెస్ ప్రోగ్రాంల పేరిట తనిఖీలను ముమ్మరం చేశారు.


మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో...

మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఈ వారాంతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై (డ్రంక్ అండ్ డ్రైవ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 286 మంది మద్యం తాగి నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 251 మంది బైకర్లు, 9 మంది ఆటో డ్రైవర్లు, 26 మంది లారీ డ్రైవర్లు, నలుగురు భారీ వాహనాల డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో దొరికారు. ఇందులో 259 మంది బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ (బీఏసీ) స్థాయి 200 మిల్లీగ్రాములు ఉందని పరీక్షల్లో తేలింది. మరో 27 మంది డ్రైవర్లైతే పీకల దాకా డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడైంది.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వారికి తాము కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ కె రాహుల్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



మందుబాబులకు శిక్షలు

గత వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 30 మంది మందుబాబులకు కోర్టులు జైలుశిక్షతో పాటు జరిమానా విధించాయి.ఇద్దరికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. మరో 186 మందికి కేవలం జరిమానా విధించింది.

హైదరాబాద్ నగరంలో...

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడపడంపై క్రమం తప్పకుండా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. వారాంతాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ తనిఖీల్లో తరచుగా 300-400 మంది వాహనచోదకులను పోలీసులు పట్టుకుంటున్నారు. ఈ తనిఖీలలో చాలా మంది నేరస్థులకు జైలు శిక్షలు విధించగా, మరికొందరికి సామాజిక సేవ కేటాయించారు.ఏప్రిల్ నెలలో రెండు రోజుల ప్రత్యేక తనిఖీల్లో 343 కేసులు నమోదు చేశారు. మార్చి 6-7 తేదీల్లో జరిగిన దాడుల్లో 445 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే.ఫిబ్రవరి 6-7 తేదీల్లో జరిగిన రెండు రోజుల ప్రత్యేక తనిఖీల్లో అధిక బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ (BAC) స్థాయిలు కనుగొనటంతో 600 మందికి పైగా వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

మోటార్ వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ 185 ప్రకారం మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపి నేరం చేసిన వారికి రూ.10 వేల వరకు జరిమానా,లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించారు.

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న వాహనచోదకులు


సైబరాబాద్ లో ...

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝళిపించారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రతి వారాంతంలో 170కి పైగా కేసులు నమోదు చేశారు. వీటిలో అధికభాగం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే. నేరస్థులను తక్షణ చట్టపరమైన చర్యల కోసం కోర్టులో హాజరుపరుస్తున్నారు. మియాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి వంటి అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తరచుగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.చాలా మంది మందుబాబులు 21-40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తేలింది.

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ లో ఒక రోజు ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హెల్మెట్ ధరించని 151 మందిపై కేసులు నమోదు చేశారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవర్లకు పోలీసుల కౌన్సెలింగ్

ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా, ప్రజల్లో అవగాహన లేకపోతే ప్రమాదాలు తగ్గవు. ఒక క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగులుస్తుంది. కాబట్టి ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో డ్రైవింగ్ చేస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుంది.


Read More
Next Story