
ఐబొమ్మ రవి కొత్తమోసం తెలిసి షాకైన పోలీసులు
రవి మొదలుపెట్టిన రెండు వెబ్ సైట్లు ప్రహ్లాద్, ప్రసాద్ పేర్లతో రిజిస్టర్ అయినట్లు బయటపడింది
తవ్వేకొద్దీ ఐబొమ్మ రవి మోసాలు బయటపడుతునే ఉన్నాయి. తాజాగా బయటపడిన ఒక మోసం తెలిసిన పోలీసులే షాక్ తిన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే(iBomma Ravi) ఐబొమ్మ వెబ్ సైట్ కాని, వెబ్ సైట్ కు సంబంధించిన అనుమతులు కాని ఏవీ రవి పేరుతో లేవు. రవి మొదలుపెట్టిన రెండు వెబ్ సైట్లు ప్రహ్లాద్, ప్రసాద్ పేర్లతో రిజిస్టర్ అయినట్లు బయటపడింది. అలాగే ఐబొమ్మ వెబ్ సైట్ కు ముందు స్టార్ట్ చేసిన హాస్పిటల్. ఇన్, సప్లైస్. ఇన్ అనే వెబ్ సైట్లు కూడా రవి పేరుతో లేవు. రవి పేరుతో కాకుండా ఇంకెవరి పేర్లతో వెబ్ సైట్లు నడుస్తున్నాయి ?
ఎవరిపేర్లతో అంటే ప్రసాద్, ప్రహ్లాద్ పేర్లతో వెబ్ సైట్లు నడుస్తున్నాయి. వెబ్ సైట్ అనే కాదు ఏ బిజినెస్ చేయాలన్నా ఆధార్ కార్డ్, ప్యాన్ కార్డ్ కాపీలు ఇవ్వటం తప్పనిసరి. ప్రహ్లాద్ పేరుతో ఉన్న ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును తనవిగా కరేబియన్ దీవుల్లోని సెయింట్ కీట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వానికి వాడుకున్నాడు. ప్రహ్లాద్ పేరుతో ఉన్న ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పైన రవి తన ఫొటోలను అతికించి దరఖాస్తు చేసుకుని పౌరసత్వం తీసేసుకున్నాడు. అలాగే వెబ్ సైట్ వ్యాపారంలో కూడా అవే కార్డులను, పౌరసత్వం వివరాలను చూపించాడు.
ఇంతకీ ప్రసాద్, ప్లహ్లాద్ కు సంబంధించిన ఆధార్, ప్యాన్ కార్డ్, డ్రైవింగ్ లెసెన్స్ రవికి ఎలా దొరికాయి. రవి, ప్రసాద్ 10వ తరగతిలో స్నేహితులు. కాబట్టి ప్రసాద్ వివరాలను రవి వాడేసుకున్నాడు. అలాగే ప్రహ్లాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి సంబంధించిన ఆధార్, ప్యాన్, డ్రైవింగ్ లైసెన్సు రవికి ఎలాగ దొరికాయో అర్ధంకావటంలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఏ దశలో కూడా పరిచయంలేదు. ఇదే విషయాన్ని ప్రహ్లాద్ ను పోలీసులు విచారించినపుడు 2016లో సాఫ్ట్ వేర్ కోర్సులు చేయటం కోసం ప్రహ్లాద్ హైదరాబాద్, అమీర్ పేట్ లో ఉండేవాడు.
అదే సమయంలో, అదే ఇన్ స్టిట్యూట్ లో రవి కూడా కోర్సులు నేర్చుకున్నాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్ కు సంబంధించిన కార్డులను రవి సంపాదించి ఉండవచ్చు. అప్పుడు దొంగతనంగా సంపాదించిన ప్రహ్లాద్ ఆధార్, ప్యాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సులను తర్వాత కాలంలో వ్యాపారంలోకి దిగినపుడు రవి ఉపయోగించుకున్నాడు. పోలీసుల విచారణలో రవి వ్యాపారాలతో ప్రసాద్, ప్రహ్లాద్ కు ఎలాంటి సంబంధంలేదని తేలింది. తమ గుర్తింపుతో రవి వ్యాపారాలు చేశాడని తెలుసుకున్న ప్రసాద్, ప్రహ్లాద్ షాకయ్యారు.

