
Source: Wikipedia: Secunderabad Clock Tower
సికింద్రాబాద్ ఘనత ఎక్కడ? మల్కాజ్ గిరి గల్లీలెక్కడ?
మల్కాజ్ గిరి కార్పొరేషన్ లో సికింద్రాబాద్ విలీనం ప్రతిపాదనకు సర్వత్రా నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 27 మున్సిపల్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ను జీహెచ్ఎంసీ లో విలీనం చేయటం ద్వారా దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా అవతరించింది. దాని వైశాల్యం 650 కిలోమీటర్ ల నుండి 2,053 కిలోమీటర్ లకు పెరిగింది. వార్డుల సంఖ్య 150 నుండి 300కు పెరిగింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా ఎదిగిన జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లు గా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి) విడగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ 300 వార్డులను ఏ విధంగా విడగొట్టి విభజించాలి అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అందులో భాగమే సికింద్రాబాద్ ను మల్కాజిగిరి కార్పొరేషన్లో విలీన ప్రతిపాదన.
220 ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజిగిరి కార్పొరేషన్లో కలపడం ఏ మాత్రమే ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్షాలు, ఈ ప్రాంత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు వ్యతిరేకిస్తున్నాయి. ఏ నిర్ణయం అయినా రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాలను చర్చలో భాగస్వామ్యం చేసి తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ప్రతిపాదన పై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి జనవరి 11 న దీనికి వ్యతిరేకంగా బాలంరాయిలోని లీ ప్యాలెస్ లో వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార, వాణిజ్య, కార్మిక, కుల సంఘాలు, ఉద్యమ సంఘాల ప్రతి నిధులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా జనవరి 17న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.
220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరుతో కాకుండా వేరొక పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నం ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిదర్శనం అని తలసాని అన్నారు. “ఈ ప్రాంతానికి వేరే కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు అహింసా పద్దతుల్లో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. 1897లో 120 అడుగుల ఎత్తుతో నిజాం కాలంలో నిర్మించిన క్లాక్ టవర్ చరిత్రకు సజీవ సాక్ష్యం,” అన్నారు.
ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు చేస్తోందని బీజేపీ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “జనాభా లెక్కల కోసం వార్డుల వివరాలు సంఖ్య చెప్పమని ఆరు నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి ఉత్తరాలు అందాయి. డిసెంబర్ 31 కి చివరి తేదీ దగ్గర పడుతోందని ఆఖరు నిమిషంలో దాన్ని సాకుగా చూపి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా వార్డులను విభజించారు. కొన్ని వార్డులు వేరు వేరు జిల్లాలు, లోక్ సభ నియోజకవర్గాలలోకి వచ్చేటట్టు విభజించారు. ఏ నిబంధనలు పాటించలేదు. వాటి మ్యాప్ లు అడిగినా ఇవ్వలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేయకముందు సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ గా వుండేది. 300 వార్డులను ఏ విధంగా విభజించాలి అని రాజకీయ పార్టీలు మాత్రమే కాక వివిధ వర్తక, ఉద్యమ సంఘాలను సంప్రదించి తీసుకోవాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం 2007లో జీహెచ్ఎంసీని ప్రకటించినప్పుడు ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ లో ఉండగా వ్యతిరేకించాను. చిన్న సంస్థలలోనే ప్రజలకు పనులు సులభంగా అవుతాయి,” అని అంటూ ప్రతి ప్రాంతానికి ఉన్న చరిత్ర దాని తాలూకు భావనలను పరిగణలోకి తీసుకోవాలి అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు కమిషనరేట్‌లను ఏర్పాటు చేసే సమయంలో పెద్దగా ఎవరికి తెలీని రాచకొండ పేరును పెట్టారు. “కేసీఆర్ రాచకొండలో రాచరికానికి గుర్తుగా వుండే 14 శతాబ్దం కోటను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ పేరు పెట్టడంలో అతని ఫ్యూడల్ మనస్తత్వం బయట పడింది,” అని వివరించారు.
రాజ్య సభ సభ్యుడు, సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పేరుపై యింకా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. “సికింద్రాబాద్‌ను జిల్లా చేసే ఆలోచన వుంది. కంటోన్మెంట్ ను మల్కాజిగిరి కార్పొరేషన్లో కలుపుతారు. జీహెచ్ఎంసీలో వున్న 300 వార్డులను ఏవిధంగా విభజించాలి అనే చర్చ జరుగుతోంది. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు జరుగుతాయి. బీజేపీ, బిఆర్ఎస్ ల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుంటాం,” అని వివరించారు.
ఈ విషయం పై ప్రస్తుత సికింద్రాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. దీపక్ జాన్ వివరణ కోరగా అంతర్గతంగా యింకా చర్చిస్తున్నామని, ఆ తరువాతే పార్టీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతామని అన్నారు.
మల్కాజిగిరి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ.టీ. శ్రీనివాసన్, మల్కాజిగిరి కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకించారు. చాలా పరిపాలనా పరమైన సమస్యలు వస్తాయి అన్నారు. ఈస్ట్ మారేడుపల్లి రెసిడెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ వి. విజయరాఘవన్ అసోసియేషన్ తరపున యింకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. “మా ప్రాంతంలో రోడ్లపై మురుగునీరు పారటం ఆగటం లేదు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతానికి కేంద్రంగా వుంది. మా సమస్యలు తీరితే పేరుతో నిమిత్తం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం,” అని అన్నారు.
కంటోన్మెంట్ ప్రాంతాన్ని సిటీ లో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ తీసుకుని చేయాలిని, కేంద్రం దీనికి అంగీకరిస్తూ నాలుగు ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎల్. అగర్వాల్ అన్నారు. “ప్రపంచంలో ఎక్కడ సైనికులకు కంటోన్మెంట్ కోసం ప్రత్యేక ప్రాంతాలు లేవు. ప్రజలతో కలిసే వాళ్ళు బ్రతుకుతారు. అవి ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ప్రజల నుండి తమను తాము కాపాడుకోవటం కోసం ఏర్పాటు చేసినవి,” అన్నారు.
ప్రభుత్వం ప్రజల ముందు తన ఆలోచన పెట్టి సూచనలు కోరాలి. కేవలం ప్రజలు ఎలా స్పందిస్తారో తెల్సుకోవటానికే లీక్ లు ఇస్తున్నారు. సికింద్రాబాద్ లో ఎటువంటి నిర్మాణాలు లేని బహిరంగ ప్రదేశాలు చాలా వున్నాయి. మల్కాజిగిరి అంటే దాని పరిధి అసెంబ్లీ నియోజకవర్గమా లేక పార్లమెంటు ఆ అనేది, స్పస్టత లేదు, అని పబ్లిక్ పాలసీ నిపుణుడు, దొంతి నరసింహ రెడ్డి అన్నారు.

