టెలిఫోన్ ట్యాపింగ్ లో సంచలనం,  ప్రణీత్ రావుకు డిమోషన్
x
Demoted DySP Praneet Rao

టెలిఫోన్ ట్యాపింగ్ లో సంచలనం, ప్రణీత్ రావుకు డిమోషన్

యాక్సిలరేటెడ్ పద్దతి అన్నది మావోయిస్టుల ఏరివేత లేదా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేసే కార్యకలాపాల్లో పనిచేసిన వారికి మాత్రమే ప్రమోషన్లు ఇస్తారు


టెలిఫోన్ ట్యాపింగ్ లో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. డీఎస్పీ హోదా రద్దుచేస్తు ఇన్ స్పెక్టర్ గా డిమోట్ చేసింది. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసులో మొదట అరెస్టయ్యింది ప్రణీత్ రావే(praneet Rao) అన్న విషయం తెలిసిందే. సీఐగా పనిచేస్తున్న ప్రణీత్ ను కేసీఆర్ ప్రభుత్వం యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పద్దతిలో డీఎస్పీగా ప్రమోట్ చేసింది.


2007 ఎసై బ్యాచ్ లో 300 మంది ఎంపికైతే ప్రణీత్ రావు ఒక్కడికి మాత్రమే అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ విషయమై అప్పట్లోనే చాలా గొడవలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రణీత్ కు ప్రమోషన్ ఇచ్చేసింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కారణంగానే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చిందని అందరికీ అర్దమైంది. ఎసైగా ప్రణీత్ 2016 అక్టోబర్ 24వ తేదీన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్నపుడు ఇన్ స్పెక్టర్ గా తర్వాత డీఎస్పీగా ప్రమోషన్ పొంది 2023, డిసెంబర్ 13 వరకు పనిచేశారు.


యాక్సిలరేటెడ్ పద్దతి అన్నది మావోయిస్టుల ఏరివేత లేదా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేసే కార్యకలాపాల్లో పనిచేసిన వారికి మాత్రమే ఈ పద్దతిలో ప్రమోషన్లు ఇస్తారు. ఎందుకంటే పై ఆపరేషన్లలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారు కాబట్టి యాక్సిలరేటెడ్ పద్దతిలో ప్రమోషన్ ఇస్తారు. డీఎస్పీగా ప్రమోట్ అవగానే ప్రణీత్ ఆధ్వర్యంలోనే స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఏర్పాటైంది.

2023లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వెంటనే ఎస్ఐబీ భవనంలో ట్యాపింగ్ కోసం ఏర్పాటుచేసిన పరికరాలన్నింటినీ తీసేశారు. భవనంలో కరెంట్ తీసేసి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, లాంగర్ రూములోని ల్యాప్ టాపులు, కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్క్ ల్లోని డేటాలను ధ్వంసంచేయటంలో ప్రణీత్ రావే కీలకమని ట్యాపింగ్ ను విచారిస్తున్న స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. అందుకనే ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలని సిట్ ఉన్నతాధికారులు హోంశాఖకు సిఫారసుచేశారు. ప్రణీత్ చేసిన పని టీఎస్ సీఎస్(కండక్ట్) రూల్స్, 1964లోని రూల్ నెంబర్ 3 ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకనే ప్రణీత్ ను సస్పెండ్ చేయాలని సిట్ సిఫారసుచేసింది. ఈ సిఫారసుతో ప్రణీత్ ను సస్పెండ్ చేయటం కాకుండా 10వ తేదీన పంజగుట్ట పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు కాగానే అరెస్టు కూడా చేశారు.

ఈవిషయాలన్నింటినీ పరిశీలించిన హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్ యాక్సిలరేటెడ్ పద్దతిలో అక్రమంగా ప్రమోషన్ పొందినట్లు నిర్దారణ చేసుకున్న ఆనంద్ ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దుచేసి ఇన్ స్పెక్టర్ గా డిమోట్ చేస్తు పిబ్రవరి 3వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది.

Read More
Next Story