ఆ రోజే డెలివరీ చేయండి.. డాక్టర్ల వద్దకు క్యూ కడుతున్న గర్భిణులు..
గర్భిణులు తమ బిడ్డకు జనవరి 22న జన్మనివ్వాలనుకుంటున్నారు. ఆ రోజే ఆపరేషన్ చేయాలని డాక్టర్లను కోరుతున్నారు. ఆ రోజు ఏమిటంత విశేషం.
‘‘రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక. చారిత్రాత్మకంగా నిర్మించిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. అదే రోజు ఆలయంలో బాలరాముడి (రామ్‌లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.
అయోధ్య రామ మందిరంలో పవిత్రోత్సవం సందర్భంగా 22వ తేదీన తమకు సిజేరియన్ ప్రసవాలు చేయాలని పలువురు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరుతున్నారు.
‘‘జనవరి 22వ తేదీన ప్రసవాలు చేయాలని ఇప్పటికే 14 మంది గర్భిణులు మమ్మల్ని కోరారు. ఆ రోజున 35 సిజేరియన్ ఆపరేషన్లకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో ప్రసూతి, గైనకాలజీ విభాగానికి ఇన్‌చార్జి సీమా ద్వివేది అన్నారు.
‘‘మా దగ్గరికి వచ్చిన కొంతమంది గర్భిణులకు డెలివరీ డేట్ 22 కంటే కొన్ని రోజుల ముందు లేదా 22 తర్వాత ఉంది. కాని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం రోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావించి, ఆ రోజునే సిజేరియన్ చేయాలని కోరుతున్నారు’’ అని పేర్కొన్నారు.
కాబోయే తల్లులు తరచుగా పూజారుల దగ్గరకు వెళ్లి మంచిరోజు, మంచి ఘడియలు చెప్పమని అడుగుతారు. ఆ రోజునే డెలివరీ కోసం వైద్యులను సంప్రదిస్తారని ద్వివేది చెప్పారు.
తల్లులు, వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పూజారి చెప్పిన ‘ముహూర్తం’లో డెలివరీ చేసిన అనుభవాలను ద్వివేది వివరించారు.
ఇచ్చిన డెలివరీ డేట్ కంటే ముందు లేదా తర్వాత ప్రసవాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అని ద్వివేది చెప్పారు.
‘‘రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక అని తల్లులు నమ్ముతారు. అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించిన శిశువులు కూడా రాముడి లక్షణాలతో ఉంటారని వారి భావన. ఆ కారణంగానే జనవరి 22న డెలివరి చేయాలని మా వద్దకు వస్తున్నారు’’ అని ద్వివేది తెలిపారు.
కళ్యాణ్‌పూర్‌కు చెందిన మల్తీ దేవి (26) డెలివరీ డేట్ జనవరి 17. అయితే రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన రోజున తన బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నట్లు దేవి తెలిపారు. ‘‘నా బిడ్డ విజయం, కీర్తి పొందేలా ఎదగాలని నేను ఆశిస్తున్నాను’’ అని ఆమె చెప్పింది.
‘‘ఒక బిడ్డ శుభ ఘడియలో పుడితే, అది శిశువు వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రజలు నమ్ముతారు. కొన్నిసార్లు మతం, ఆధ్యాత్మికత వ్యక్తి జీవితంలోని ఒత్తిళ్లను అధిగమించడానికి, సానుకూల దృక్పథంతో ఉండేందుకు దోహదపడతాయని’’ అని మనస్తత్వవేత్త దివ్య గుప్తా అన్నారు.