
మేయర్ ఎన్నికలు: ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు
మేయర్, ఛైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల కోసం ఎక్స్‌అఫిషియో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్‌ఈసీ రాణికుముదిని ఆదేశాలు.
మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు వెలువడ్డాయి. పరోక్ష ఎన్నికల కోసం ఎక్స్ అఫిషియో ఓటర్ల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16న జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల నిర్వహణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలను పంపించాలని సూచించారు. అలాగే ఈ నెల 11 నుంచి 14 వరకు కొత్తగా నమోదు కావాల్సిన ప్రజాప్రతినిధుల వివరాలను సేకరించాలని ఆదేశించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏదైనా ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 14న పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 16న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరైతే కోరంగా పరిగణిస్తామని, లేకపోతే మరుసటి రోజు సమావేశం నిర్వహించాలని సూచించారు.
పరోక్ష ఎన్నికల్లో చేతులెత్తే విధానంలో ఓటింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

