మోదీ ప్రసంగాలు విని మోసపోకండి - మార్పు కోసం ఓటేయండి: ప్రియాంక
x

మోదీ ప్రసంగాలు విని మోసపోకండి - మార్పు కోసం ఓటేయండి: ప్రియాంక

ప్రధాని మోదీ ప్రసంగాలను విని మోసపోవద్దని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఓటర్లను కోరారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాల్లో వాడే మాటలను విని మోసపోవద్దని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఓటర్లను కోరారు. ఉత్తరాఖండ్‌లోని రాంనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు.

"మోదీజీ ప్రసంగాలను విని మోసపోకండి. ఓటు వేసే ముందు 10 ఏళ్ల పాలనలో మోడీ మీ జీవితాల్లో మార్పు తెచ్చారా? అని ఒక్కసారి ప్రశ్నించుకోండి’’అని ఓటర్లను కోరారు.

నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణానికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కి చెందిన మహిళను ఎవరు రక్షిస్తున్నారో ప్రజలు ప్రధాని మోదీని నిలదీయాలని కోరారు.

మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించిన ప్రియాంక, యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలలో రూ. 15 లక్షలు జమ చేయడం గురించి మోదీని ప్రశ్నించాలని ఓటర్లను కోరారు.

బీజేపీవి మత రాజకీయాలు..

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓట్ల కోసం ప్రతి ఎన్నికల్లో మతాన్ని వాడుకుంటోందని ప్రియాంక ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్‌ను కూడా దేవభూమిగా మోదీ అభివర్ణించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కొన్ని నెలల తర్వాత విపత్తు సంభవించినప్పుడు, మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. . రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంది" అని గుర్తు చేశారు.

"బార్ మోడీ సర్కార్" అని ప్రధాని అన్నపుడు 'ఔర్ కిత్నీ బార్ మోడీ సర్కార్' అని అడుగుతున్నట్లు అనిపిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు అన్నారు. "త్యాగానికి వెలకట్టలేం. నిజమైన విశ్వాసం త్యాగాల నుండి వస్తుంది. నాకు త్యాగం తెలుసు. 19 ఏళ్ల వయస్సులో నేను మా నాన్న శరీర భాగాలను మా అమ్మ ముందు ఉంచాను. వారు మా తండ్రిని అవమానించినప్పుడు మేము ఓర్పుతో ఉన్నాం. మా హృదయాల్లో నిజమైన విశ్వాసం ఉంది" అని అన్నారు ప్రియాంక. ప్రియాంక తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురైన విషయం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ నిర్వహించిన తొలి భారీ ర్యాలీ ఇదే. హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన రూర్కీలో జరిగే మరో ర్యాలీలో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read More
Next Story