తెలంగాణలో పట్టాలెక్కని  ప్రాజెక్టులెన్నో తెలుసా?
x
తెలంగాణలో కొత్త రైలుమార్గాల నిర్మాణం కాగితాల్లోనే...

తెలంగాణలో పట్టాలెక్కని ప్రాజెక్టులెన్నో తెలుసా?

పెండింగ్‌లోనే రైల్వే ప్రాజెక్టులు…పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయాలు


తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులు గణనీయంగా వెనుకబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలు కొత్త రైల్వే మార్గాలు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులను ప్రతిపాదించినప్పటికీ, కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి నిధుల విడుదలలో జాప్యం కారణంగా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. సర్వేలు పూర్తయి, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధమైనా ప్రాజెక్టులు పట్టాలెక్కకపోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తోంది.

ప్రతిపాదనల్లో మగ్గుతున్న రైల్వే ప్రాజెక్టులు

- వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, చిట్లపల్లి, టేకల్ కోడే, రావులపల్లి, మాటూర్, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట, మఖ్తల్ మీదుగా కృష్ణా వరకు కొత్త రైలు మార్గం నిర్మించాని ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
- మిర్యాలగూడ నుంచి పాపటపల్లి , జాన్ పహాడ్ మీదుగా డోర్నకల్- గద్వాల కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ 2024లో అధికారిక లేఖ రాసినా ఈ ప్రాజెక్టు కేంద్రం వద్ద పెండింగులోనే ఉంది.
- కల్వకుర్తి నుంచి వయా వంగూరు, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి, మీదుగా మాచర్ల వరకు కొత్త రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదనలు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వద్ద పెండింగులోనే ఉన్నాయి.
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో రైల్వేమంత్రిత్వశాఖ నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు వేగిరం కావడం లేదు.
- హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పైసా నిధులు కూడా రాల్చడం లేదు. ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతుండగా కేంద్రం నుంచి స్పందన లేదు.
- చర్లపల్లి నుంచి ప్రయాణికుల రాకపోకలకు రోడ్లను విస్తరించలేదు. దీంతో పాటు రైల్వే వంతెనల నిర్మాణం పూర్తి చేయలేదు.

మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో రైల్వే ప్రాజెక్టుల గురించి సమీక్షిస్తున్న సీఎస్ రామకృష్ణారావు

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలి : సీఎస్ రామకృష్ణా రావు

తెలంగాణ రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ఆదేశించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే అండర్ బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రజా రవాణా మరింత మెరుగు పరచడం లాంటి 21 అంశాలపై సీఎస్ సమీక్షించారు.
రైల్వే పెండింగ్ అంశాలకు సంబంధించి మున్సిపల్, జలమండలి, రెవిన్యూ, విద్యుత్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సంయుక్త తనిఖీలను నిర్వహించి తగు పరిష్కార మార్గాలు తీసుకోవాలని సి.ఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఈ రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశాలపై త్వరలోనే రైల్వే ఉన్నతాధికారులతో సమావేశముందని, ఈ లోపు ప్రతీ పెండింగ్ అంశానికి తగు నివేదికను సమర్పించాలని సీఎస్ కోరారు.

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులేవి : ఎంపీ రేణుకాచౌదరి

తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టుల సర్వేలు చేసి, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసినా రైల్వే మంత్రిత్వశాఖ నిధులు మాత్రం విడుదల చేయడం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి జీరో అవర్ లో ఆందోళన వ్యక్తం చేశారు.కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం 12 ఏళ్లుగా సాగుతూనే ఉందన్నారు.
కొత్త రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఎంపీ రేణుకాచౌదరి రాజ్యసభలో ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణపై బీజేపీ సర్కారు వివక్ష

దేశంలోని 19 మెట్రో ప్రాజెక్టులకు గత ఆరేళ్లలో వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపించింది.కొత్త రాష్ట్రమైన తెలంగాణలో మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు,ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి వాళ్లు తెచ్చిన నిధులు మాత్రం "గుండు సున్నా అని బీఆర్ఎస్ పేర్కొంది.

రైల్వే ప్రాజెక్టులపై సీఎం ఆసక్తి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు.అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైస్పీడ్ రైళ్లు నడిపేలా పెద్ద టెర్మినల్ నిర్మించాలని సీఎం సూచించారు.భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు. 362 కి.మీ మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి కేంద్రం-రాష్ట్రం మధ్య సమన్వయం అత్యవసరం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, నిధుల విషయంలో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రాజెక్టుల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
Read More
Next Story