‘రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ముక్కలు చేయవద్దు’
x

‘రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ముక్కలు చేయవద్దు’

నిరసనగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మదగ్దం... నిర్ణయం మార్చుకొనకపోతే కోర్టుకెళతామంటున్న బిఆర్ ఎస్ పార్టీ


హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌లో కలపడానికి భారత రాష్ట్ర సమితి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకుల నిరసనలు చేపట్టారు. రాజేంద్ర నగర్ ని హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనంచేసేముందు ప్రజాభిప్రాయం సేకరించలేదని, జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలను విలీనం ఎలా చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

రాజేంద్రనగర్ ని హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రతిపాదన పై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టామని. స్థానిక ఎమ్మెల్యేకి కూడా లేఖ ఇచ్చి, జీహెచ్‌ఎంసీలో విలీనం చేయకుండా రాజేంద్రనగర్ ప్రత్యేకతను కాపాడాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలని బిఆర్ ఎస్ రాజేంద్ర నగర్ ఇన్ చార్జి ట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు

"రాజేంద్రనగర్‌ను ముక్కలు చేయడం వల్ల మా ప్రాంత విశిష్టత, అస్తిత్వం దెబ్బతింటుంది. ఒకవేళ మూడు కార్పొరేషన్లు చేయాల్సి వస్తే, రాజేంద్రనగర్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే మా స్పష్టమైన డిమాండ్.

హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా చేస్తే, జనాభా లెక్కలు, పరిపాలనా సౌలభ్యం, డివిజన్ల సంఖ్య వంటి అంశాల్లో స్పష్టమైన లాజిక్ ఉండాలి. మేడ్చల్–మల్కాజ్గిరి 75 డివిజన్లు, సైబరాబాద్ 75 డివిజన్లు ఉంటే, హైదరాబాదుకు 150 డివిజన్లు ఎందుకు?," అని ఆయన ప్రశ్నించారు.

జనాభా సుమారు సమానంగా ఉంటే ఈ అసమానతకు కారణం ఏమిటి? ఈ నిర్ణయంలో సాంకేతికత ఎక్కడ? పారదర్శకత ఎక్కడ? అని అంటూ ప్రజలను అడగకుండా, స్థానిక శాసనసభ్యుల అభిప్రాయం తీసుకోకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాజేంద్రనగర్ ప్రజల మనోభావాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని ఆయన అనమ్నారు.

‘‘హైదరాబాద్ కార్పొరేషన్‌లో కలిపిన తర్వాత మా ప్రాంతానికి మేయర్ పదవి వస్తుందని హామీ ఇవ్వగలరా? కనీసం మీ పార్టీ వ్యక్తికైనా వస్తుందని గ్యారెంటీ ఇవ్వగలరా? ఒకవేళ వేరే వర్గానికి మేయర్ పదవి వెళ్తే, అభివృద్ధి నిధులు, ప్రణాళికలు సమానంగా అందుతాయా? లేక మా ప్రాంతం పన్నులు కడితే, ప్రగతి వేరే ప్రాంతాలకు మళ్లుతుందా? ఈ పునర్విభజన వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. రాజేంద్రనగర్‌కు న్యాయం చేయాలి. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. మా ప్రాంతానికి నష్టం కలిగించే ఏ నిర్ణయాన్నైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం,’ అని ఆయన అన్నారు.

"రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత మా ప్రాంతానికి జరుగుతున్న ఈ అన్యాయంపై నిజంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారా? మీ మాటకు ప్రభుత్వం విలువ ఇస్తుందా? లేక రాజేంద్రనగర్ ప్రయోజనాలు పక్కన పెట్టబడ్డాయా? మీరు నిజంగా మా ప్రాంత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, ఈ విలీనాన్ని బహిరంగంగా వ్యతిరేకించాలి,’ అని ఆయన ఎమ్మెల్యే ధోరణిని విమర్శించారు..

ఈనిర్ణయం మార్చుకోవాలని, అవసరమైతే కోర్టు ద్వారానైనా రాజేంద్రనగర్ అస్తిత్వం, రాజకీయ హక్కులు, ఈ ప్రాంత గౌరవం కాపాడుకునే వరకు ఈ పోరాటం చేస్తామని కార్తీక్ రెడ్డి చెప్పారు.

Read More
Next Story