రిపోర్టులతో సరిపెట్టద్దు హెటెరో యూనిట్-1ను వెంటనే మూసివేయాలి
x

"రిపోర్టులతో సరిపెట్టద్దు హెటెరో యూనిట్-1ను వెంటనే మూసివేయాలి"

దోమడుగులో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ భారీ ర్యాలీ - ఎన్నికల బహిష్కరణకు పిలుపు


నివేదికలు ఇవ్వడం తోనే పీసీబీ బాధ్యత తీరిపోదని, 2013 లోనూ ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చినా హెటెరో (Hetero) యూనిట్-1 నుండి కాలుష్యం ఆగలేదని దాన్ని మూసివేయాలి అని దోమడుగు గ్రామ ప్రజలు నినాదాలు యిస్తూ గ్రామంలో ర్యాలీ తీశారు. 2013 లోనూ నల్లకుంట చెరువు కాలుష్య నీటిని, మట్టిని ఎత్తి పోయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఇపుడు పిసిబి ఉత్తర్వుల్లో దాని ప్రస్తావన కూడా ఎందుకు లేదు అని వాళ్ళు ప్రశ్నించారు.

గ్రామంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన టీపీజెఏసీ (Telangana Praja Joint Action Committee) జిల్లా అధ్యక్షులు వై. అశోక్ కుమార్, “పాడైన చెరువు నీటిని, మట్టిని ఎవరు ఎత్తిపోయాలి. 12 ఏళ్లుగా విష వాయువులను వదిలి ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తే ఎవరు బాగు చేయాలి, పశువుల మరణానికి మూల్యం ఎవరు చెల్లించాలి, వీటన్నింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. దోమడుగులో గాలి, నీరు విషతుల్యం అయ్యి మహిళలకు గర్భవిచ్ఛిన్నం అవుతోంది, క్యాన్సర్ తదితర వ్యాధులు పెరుగుతున్నాయి, చిన్న పిల్లలు రకరకాల అకాల వ్యాధుల బారిన పడుతున్నారు, పశువులు చనిపోతున్నాయి, వ్యవసాయం పూర్తిగా నాశనమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవించే హక్కులో భాగంగా మంచి గాలి, స్వచ్ఛమైన నీరు పొందడం మా ప్రాథమిక హక్కు. మా హక్కును కాలరాస్తున్న హెటెరో డ్రగ్స్ యూనిట్-1ను వెంటనే మూసివేయాలి అనే నినాదాలతో ర్యాలీ జరిగింది. కాలుష్య సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనబోమని, ఎన్నికలను పూర్తిస్థాయిలో బహిష్కరిస్తామని కమిటీ హెచ్చరించింది. "సమస్య తీర్చని ప్రజాప్రతినిధులు మా ఊరికి ఓట్ల కోసం రావొద్దు" అని గ్రామస్తులు స్పష్టం చేశారు.

కాలుష్య నియంత్రణ బోర్డు సరైన చర్యలు తీసుకోవటం లేదని చెప్తూ, “2022 నుండి 2025 వరకు ఎనిమిది సార్లు పీసీబీ తనిఖీలు చేసి తన రిపోర్టులలో కంపెనీ తప్పులు చేస్తున్నట్లు సాక్ష్యాలు దొరికినా కేవలం "ఆదేశాలు" ఇస్తోంది. కంపెనీని మూసివేయడం (Closure), క్రిమినల్ కేసులు పెట్టడం (Prosecution), లేదా నష్టపరిహారం వసూలు చేయడం వంటి కఠిన చర్యలు బోర్డు తీసుకోలేదు. యిది సుప్రీంకోర్టు కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి అని చెప్పిన తీర్పుల ఉల్లంఘన. వాళ్ళే చెరువును శుద్ధి చేసి బాధితులకు పరిహారం ఇవ్వాలి. పీసీబీ కేవలం 96 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీతో సరిపెట్టింది. చెరువు శుద్ధికి 18 నుండి 37 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా,” అని టీపీజెఏసీ బోర్డు రిపోర్ట్ పై స్పందించింది.

హెటెరో డ్రగ్స్ నుండి వెలువడే రసాయనాలు (effluents) మరియు నల్లకుంట చెరువులోని కలుషితాలు ఒకటేనని శాస్త్రీయంగా నిరూపించబడింది. కంపెనీలోని సున్నా వ్యర్థాల విడుదల (Zero Liquid Discharge) సిస్టమ్ పూర్తిగా విఫలమైందని, ప్లాంట్ నుండి ప్రమాదకరమైన గాలి (VOCs) మరియు దుర్వాసన వెలువడుతోందని నివేదిక స్పష్టం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని టీపీజెఏసీ తన పత్రికా ప్రకటనలో ప్రశ్నించింది.

ఈ కార్యక్రమంలో టీపీ జెఏసీ జిల్లా అధ్యక్షులు వై. అశోక్ కుమార్, రాష్ట్ర కో-కన్వీనర్ కన్నెగంటి రవి, జిల్లా కన్వీనర్ శ్రీధర్ మహేంద్ర, చంద్రారెడ్డి, క్లయిమేట్ ఫ్రంట్ బాధ్యులు రుచిత్, అభిలాష్ మరియు దోమడుగు కాలుష్య వ్యతిరేక కమిటీ కన్వీనర్లు బాల్ రెడ్డి, మంగయ్య, శారదమ్మతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Read More
Next Story