ఢిల్లీలో త్రివర్ణ పతాకాలతో నిరసనలు..
x

ఢిల్లీలో త్రివర్ణ పతాకాలతో నిరసనలు..

సీజేపీ నేతల అరెస్టులు, రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలో మరోసారి సీజేపీ ఆందోళన చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా నిరసన నిర్వహించడమే ఇందుకు కారణం. ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో చేపట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో, సీజేపీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల సభ్యులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిరసనలకు ముందే ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ పార్క్‌ను మూసివేసి, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు. ర్యాలీకి హాజరుకావద్దని అభిజీత్ దీప్కేకు పోలీసులు నోటీసు కూడా ఇచ్చారు.
అయినప్పటికీ, శుక్రవారం సాయంత్రం నిరసనకారులు జాతీయ జెండాలు చేతబట్టి కన్నాట్ ప్లేస్‌లోని ఇన్నర్ సర్కిల్‌లో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి. ఆందోళనకారులు ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లి నిరసనలు కొనసాగించారు.
మరోవైపు, మండి హౌస్ ప్రాంతంలో ఏఐఎస్ఏతో పాటు విద్యార్థి సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని, 2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అభిజీత్ దీప్కేను ఝండేవాలన్‌లోని ఆయన నివాసం నుంచి, నేహా బోరాను మండి హౌస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలతో నిరసన ప్రాంతాల్లో ఉద్రిక్తత పెరిగింది.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసనకారులకు మద్దతు తెలిపారు. విద్యార్థులపై పోలీసుల దాడుల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు. పోలీసుల బలప్రయోగం నిరసనకారుల పోరాట సంకల్పాన్ని దెబ్బతీయలేదని పేర్కొంటూ, బాధ్యులపై చట్టపరంగా పోరాడతామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దీప్కే నిర్బంధాన్ని తీవ్రంగా విమర్శించారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనలను తప్పుబట్టింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు యువతను రాజకీయ ఘర్షణలకు ఉపయోగించుకుంటూ దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ప్రజాస్వామ్యం పేరుతో అల్లకల్లోలం సృష్టించడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపీ నేత దిలీప్ ఘోష్ కూడా పండుగల సమయంలో రాజకీయ నిరసనలు నిర్వహించడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలోని తన కార్యాలయం సమీపంలో త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించింది.
కన్నాట్ ప్లేస్‌లో వరుసగా నిరసనలు జరగడం వల్ల పండుగల సీజన్‌లో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల్లో తమ సంస్థల్లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని రెస్టారెంట్ల సంఘం ప్రతినిధి తెలిపారు.
మొత్తంగా, ఢిల్లీలో త్రివర్ణ పతాకాలతో సాగిన నిరసనలు ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి. ఒకవైపు నిరసనకారులు ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య హక్కులపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తోంది.
డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను తీసుకురావడం, విద్యార్థులకు రోజుకు మూడు వేల చొప్పున డబ్బు ఇస్తూ జనసమీకరణకు సీజేపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అక్కడకు వచ్చి విద్యార్థులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఇటూ సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ కుప్పలుగా వస్తున్నాయి.
ఈ పరిణామాలపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనల ప్రదేశం నుంచి జంతర్ మంతర్ ను తొలగించిన ఢిల్లీ పోలీసులు ప్రత్యామ్నాయంగా రామ్ లీలా మైదాన్ తో పాటు మరో రెండు ప్రాంతాలను సూచించారు.
జంతర్ మంతర్ దేశ రాజధాని నడిబొడ్డున ఉండటం, అక్కడ నుంచి పార్లమెంట్, ఇతర కీలక కార్యాలయాలు ఉండటంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ ను నిరసనల జాబితా నుంచి పోలీసులు తొలగించారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది.
మరోవైపు సీజేపీ ఆందోళనపై అమెరికాలోని డెమోక్రాటిక్ సభ్యులు మాట్లాడారు. ఈ నెలలో భారత్ లో పర్యటించబోతున్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు ఓ లేఖ రాశారు. భారత్ లో సీజేపీ ఆందోళనను పోలీసుల ద్వారా అణచివేతకు పాల్పడుతున్నారని తరచు భారత్ మీద విషం చిమ్మే ప్రమీలా జైపాల్, ఇల్హాన్ ఓమర్ సహ మరో నలుగురు ఆ లేఖలో ఆరోపించారు.
Read More
Next Story