‘పంజాబ్‌, హర్యానా బార్డర్లు అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయి’
x

‘పంజాబ్‌, హర్యానా బార్డర్లు అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయి’

‘‘పంజాబ్‌, హర్యానా రెండు రాష్ట్రాలుగా అనిపించడం లేదు. బారికేడ్లను చూస్తుంటే..అవి అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయి.’’ అని పంధేర్‌ అన్నారు.


రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం హింసాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పోలీసులు రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల వెంబడి భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల అత్యుత్సాహంపై మంగళవారం రైతు నాయకుడు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పంజాబ్‌, హర్యానా రెండు రాష్ట్రాలుగా అనిపించడం లేదు. బారికేడ్లను చూస్తుంటే..అవి అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయి.’’ అని ఢిల్లీకి బయల్దేరిన రైతుల పాదయాత్రకు ముందు ఫతేఘర్‌ సాహిబ్‌ జిల్లాలో విలేకరులతో పంధేర్‌ అన్నారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కి చట్టపరమైన హామీ ఇవ్వాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ, లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని, భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులు రోడ్లను దిగ్బంధిస్తున్నారట కదా.. అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే రోడ్లను దిగ్బంధించిందని పంధేర్‌ సమాధానమిచ్చారు. ‘‘ఈ రోజు కూడా మేము రోడ్లను దిగ్బంధిస్తామని చెప్పలేదు. గత రెండు,మూడు రోజులుగా ప్రభుత్వమే రోడ్లను దిగ్బంధించింది’’ అని కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి పంధేర్‌ అన్నారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో కాంక్రీట్‌ గోడలు నిర్మించారని చెప్పుకొచ్చారు.

దేశ రాజధాని ఢిల్లీ వైపు రైతులు వెళ్లకుండా నిరోధించేందుకు హర్యానా అధికారులు చేసిన విస్తృత ఏర్పాట్లను ప్రస్తావిస్తూ, ‘‘మేము ఆహారధాన్యాలు పండిస్తాం. దేశాన్ని పోషిస్తాం. కాని అధికారులు కంచె పంటను పండిరచారు’’ అని పంధర్‌ పేర్కొన్నారు.

హర్యానా ప్రభుత్వంపై విరుచుకుపడిన పంధేర్‌..హర్యానాను ‘‘కశ్మీర్‌ లోయ’’గా మార్చారని, రైతులను వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి పోలీసులను పంపిందని, వాటర్‌ ఫిరంగులను మోహరించిందని ఆరోపించారు.

కేంద్ర మంత్రులతో సమావేశం గురించి ప్రస్తావిస్తూ..సమావేశం అసంపూర్తిగా ఉండటంతో వారు ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పంధేర్‌ చెప్పారు. తమ డిమాండ్లపై కమిటీని ఏర్పాటు చేయాలన్న మంత్రుల ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారని, ముఖ్యంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం రైతుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయితే రైతుల డిమాండ్లపై జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు అంబాలా-శంభు, ఖనౌరీ-జింద్‌, దబ్వాలి సరిహద్దుల మీదుగా ఢిల్లీకి చేరుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Read More
Next Story