పురాణాపూల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం
x

పురాణాపూల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం

రాజకీయ పార్టీకి చెందిన కొన్ని శక్తులు హైదరాబాద్‌లో శాంతి బలపడటాన్ని చూడాలనుకోవడం లేదన్న అసదుద్దీన్ ఒవైసీ.


పురాణాపూల్‌లో వాతావరణం వేడెక్కెంది. ఆలయంపై దాడి చేసి దేవత విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా అదే ప్రాంతంలో మరో హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకుంది. అందులో పది మంది వరకు గాయపడ్డారు. ఈ అల్లర్లలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు ఆ ప్రాంతాన్ని మోహరించారు. అక్కడి పరిస్థితులను అదుపులో ఉంచే ప్రత్నాలు చేస్తున్నారు.

అయితే బుధవారం రాత్రి జరిగిన ఆలయంపై దాడి, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా ఒక గుంపు వాహనాలుపై దాడి చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడంపైన మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఆలయంపై గుర్తు తెలియని చేసిన దాడి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ రెండు ఘటనల్లో కూడా అల్లరి మూకలు ఒక కమ్యూనిటీ వారిపై దాడికి యత్నించడంతో పురాణాపూల్‌లో హైటెన్షన్ నెలకొంది.

జరిగిందిదే..

బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి హిందూ ఆలయంపై దాడి చేశాడు. దేవత విగ్రహాన్ని, ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానిని గమనించిన కొందరు స్థానికులను అలెర్ట్ చేశారు. దీంతో అక్కడ ఒక గుంపు చేరి.. నిరసన చేపట్టింది. ఈ నిరసనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిరసనలు హింసకు దారితీయకుండా అడ్డుకున్నారు. కాగా అప్పటికే ఒక మోస్తరు గొడవలు జరగడం, అడ్డు వచ్చిన పోలీసులపై కూడా కొందరు దాడి చేశారు.

పరిస్థితి చేయి దాటి పోతుందని భావించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. వెంటనే అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇన్‌స్పెక్టర్ సహా పలువురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వెంటనే పలువురు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. స్థానికులతో చర్చలు జరిపి నచ్చజెప్పారు. ఈ ఘటనపై అడిషనల్ కమిషనర్ తఫ్‌సీర్ ఇక్బాల్, చార్‌మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్‌ల డిప్యూటీ కమిషనర్‌లు, డీసీపీ టాస్క్‌ఫోరస్ పురాణాపూల్ దర్వాజా దగ్గరకు చేరుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి సీపీ ఇక్బాల్ వివరాలు వెల్లడించారు. పూరణాపుల్ సమీపంలోని ఆలయంలోకి కొంతమంది అసాంఘిక శక్తులు చొరబడి ఫ్లెక్సీని చింపివేయడానికి ప్రయత్నించారని బుధవారం రాత్రి సుమారు 11.30 గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఘటన తరువాత కొంతమంది ఆలయం సమీపంలో చేరారని ఆయన చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే డీసీపీలు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సహా సీనియర్ అధికారులు బలగాలతో అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టారని అదనపు కమిషనర్ తెలిపారు.

“సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ ఘటనలో పాల్గొన్న వారి గురించి కొన్ని కీలక ఆధారాలు లభించాయి. మా పోలీసులు ఆ దిశగా పని చేస్తున్నారు” అని ఆయన అన్నారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని కూడా స్పష్టం చేశారు. దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పూరణాపుల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణలో హిందూ ఆలయాలపై సిస్టమాటిక్‌గా, పక్కా ప్లాన్ ప్రకారం దాడులు జరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఓట్ బ్యాంకును కాపాడుకోవడం కోసం.. ఇలాంటి తీవ్రవాద శక్తులను ఎంకరేజ్ చేస్తుందని ఆరోపించింది. పురాణాపూల్ ఘటన స్థలాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: రామచందర్ రావు

‘‘ఇది ఒంటరిగా జరిగిన సంఘటన కాదు. తెలంగాణలో తరచూ జరుగుతున్న ఆలయాల అపవిత్రతల అనే ఆందోళనకరమైన శ్రేణిలో ఇది భాగం. చిన్న దేవి ఆలయానికి నిలయమైన పూర్ణపూల్ దర్వాజా అపారమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన స్థలం. శ్రీశైలం ప్రయాణంలో ఛత్రపతి శివాజీ మహారాజు ఇక్కడే నిలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇలాంటి పవిత్రమైన చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాన్ని తీవ్రవాద శక్తులు అపవిత్రం చేయడం వెనుక పెద్దదైన ఉద్దేశపూర్వకమైన కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది. నిన్న తీవ్రవాదులు పూర్ణపూల్ దర్వాజాలోకి చొరబడి ఛత్రపతి శివాజీ మహారాజు ఫ్లెక్స్ బ్యానర్‌ను చింపివేసి దేవతల విగ్రహాలను అపవిత్రం చేశారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మూడు రోజుల క్రితమే సఫిల్‌గూడాలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అపవిత్రం చేశారు. అంతకు ముందు కీసరలోని హనుమాన్ ఆలయాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నం జరిగింది. హిందూ పూజాస్థలాలపై జరుగుతున్న ఈ వరుస దాడులు ఇవి యాదృచ్ఛికమైనవి కావని వ్యవస్థబద్ధంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. “ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం” వంటి ప్రకటనలు హిందువుల్లో అసురక్షాభావాన్ని పెంచుతున్నాయి రాజకీయ పరమైన తృప్తిపరిచే ధోరణికి ప్రమాదకరమైన సంకేతాన్ని ఇస్తున్నాయి’’ అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాఖ్యాలు నిర్లక్ష్య చర్యల వల్ల ఈ తీవ్రవాద శక్తులు మరింత ధైర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారో గుర్తించేందుకు తక్షణమే నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధ్యులు ఎవరైనా చర్యలు కఠనంగా ఉండాలి: ఒవైసీ

పురాణాపూల్‌లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సందర్శించారు. ఈ హింసాత్మక ఘటనకు బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘హైదరాబాద్‌లో సామూహిక కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఈ శక్తుల ప్రవర్తనను గమనిస్తే ఎక్కువ సంఘటనలు రాత్రివేళల్లోనే జరుగుతున్నాయి. పూర్తిగా సంబంధం లేని అంశాలపై కూడా ఇవి జరుగుతున్నాయి. సామూహిక వివాదాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.

‘‘కొందరు పోస్టర్ విసిరారని అంటున్నారు. మరికొందరు అక్కడ ఏదో జరిగిందని చెబుతున్నారు. కానీ నా ఆందోళన అక్కడ స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు అన్నదే. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు అత్యుత్తమ సీసీటీవీ వ్యవస్థ, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ఉన్నాయని చెబుతాం. ఇలాంటి ఘటనలు జరగకూడదు. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతంలో అయితే అసలు కాదు. ఈ ప్రాంతానికి 1980ల కాలం 1990ల కాలంలో సామూహిక హింస చరిత్ర ఉంది. సామూహిక విభేదాలు లేకుండా ఉండేందుకు నా పార్టీతో పాటు నేనూ వ్యక్తిగతంగా ఎంతో కృషి చేశాం. స్థానిక సమాజం ముందుకు వచ్చి సహకరించింది. అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీకి చెందిన కొన్ని శక్తులు హైదరాబాద్‌లో శాంతి బలపడటాన్ని చూడాలనుకోవడం లేదు. ఇప్పుడయినా స్థానిక పోలీసులు ఈ విషయంపై గట్టిగా దృష్టి పెట్టాలి. ఆ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే. ఇలాంటి ఘటనలు మనకు అవసరం లేదు. హైదరాబాద్ శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

Read More
Next Story