‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ’ ఉద్దేశ్యం అది కాదా?
x

‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ’ ఉద్దేశ్యం అది కాదా?

రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో మోదీ వైఫల్యాలను ఎండగడతారా? యాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చెబుతోంది.


మణిపూర్ నుంచి రాహుల్ ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్ర సైద్ధాంతిక యాత్ర మాత్రమేనని, ఎన్నికల యాత్ర ఎంతమాత్రము కాదని వాదిస్తోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందున ఈ యాత్రను చేపడుతున్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ కోసం చేపట్టే ఈ యాత్రలో భారత కూటమికి మద్దతిచ్చే పార్టీలు కూడా పాల్గొనాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక అసమానతలు, రాజకీయ నిరంకుశత్వం దేశం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ అన్నారు.

"ప్రధాని 'అమృత్ కాల్' గురించి బంగారు కలలు కంటారు. కానీ గత పదేళ్లలో వాస్తవం ఏమిటి. 'అమృత్ కాల్' గురించి మాట్లాడే పెద్దలు 'అన్యయ్ కాల్' గురించి ఎందుకు ప్రస్తావించరు.’’ అని రమేష్ ప్రశ్నించారు. గత పదేళ్లలో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్యాయాలను దృష్టిలో ఉంచుకుని యాత్ర చేపడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాహుల్ యాత్ర ముమ్మాటికి ఎన్నికల యాత్ర కాదని నొక్కి చెప్పారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా వెళుతుందని రమేష్ తెలిపారు. యాత్ర ఇంఫాల్‌కు బదులుగా మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలోని ప్రైవేట్ మైదానం నుంచి మొదలవుతుంది. తక్కువ ప్రజల నడుమ ప్యాలెస్ గ్రౌండ్ నుంచి యాత్రను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6,713 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్‌లను కవర్ చేస్తుంది. మార్చి 20 లేదా 21 న ముంబయిలో ముగుస్తుంది.

Read More
Next Story