ప్రత్యేక విమానాల్లో గుర్రాలను విదేశాలకు పంపిన ఖతార్
x
special flights for Horses transportation

ప్రత్యేక విమానాల్లో గుర్రాలను విదేశాలకు పంపిన ఖతార్

జనాల ప్రాణాలను గాలికివదిలేసి గుర్రాల కోసం ప్రత్యేక విమానాలు వేసింది.


ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని లక్షలాదిమంది జనాల పరిస్ధితి గాలిలో దీపంలాగ తయారైంది. ఏరోజు తమమీద మిసైళ్ళు పడతాయో అన్న టెన్షన్‌తో జనాలు ప్రతిరోజు చస్తు, బతుకుతున్నారు. ప్రాణభయంతో తమదేశాలకు వెళ్ళేందుకు విమానాలను నడపమని వేడుకుంటున్నా చాలా దేశాలు ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదు. ఈ నేపధ్యంలోనే ఖతార్ ప్రభుత్వం చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఖతార్ ప్రభుత్వం ఏమిచేసింది అంటే జనాల ప్రాణాలను గాలికివదిలేసి గుర్రాల కోసం ప్రత్యేక విమానాలు వేసింది. 147 గుర్రాలను ఖతార్ నుండి ప్రత్యేక విమానంలో బెల్జియంకు పంపేయటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు గురవుతోంది.

ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్, ఒమన్, సౌదీఅరేబియా, కువైట్, బహ్రెయిన్ తో పాటు ఖతార్ కూడా బాగా దెబ్బతిన్నది. ప్రతిరోజు వందలాది మిసైళ్ళు ఇరాన్ నుండి వచ్చి పడుతున్నాయి. దాంతో ప్రతిరోజు పైదేశాల్లోని జనాలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అందుకనే తమను తమ దేశాలకు పంపేయాలని ఖతార్‌లోని జనాలు ప్రభుత్వాన్ని బతిమలాడుకుంటున్నారు. అయినా ఖతార్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. అయితే మామూలు జనాలను పట్టించుకోని ప్రభుత్వం గుర్రాలకు మాత్రం ప్రత్యేక విమానాలు నడపటంతో విమర్శలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ జరిగింది ఏమిటంటే ఖతార్ లో మేలుజాతి గుర్రాలంటే సంపన్నులకే కాకుండా రాజవంశీయులకు కూడా చాలా ప్రేమ. రాజవంశీయులు ప్రత్యేకంగా వందలాది గుర్రాలను పెంచుతున్నారు. రాజకుటుంబీకులకు గుర్రాలు అంటే ఎంత ప్రేమంటే మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీతో ఏకంగా ‘అమీర్ ట్రొఫీ’ పేరుతో గుర్రపుపందేలను ప్రతిఏడాది నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని చాలామంది పాల్గొంటారు. ఖతార్‌లోని రాజకుటుంబీకుల దగ్గర మేలురకాలైన అరేబియా గుర్రాలు 147 ఉన్నాయి. ఒకవైపు గుర్రపు పందేలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే సడెన్‌గా ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది.

రెండు లేదా మూడురోజుల్లోనే ముగిసిపోతుంది అనుకున్న యుద్ధంకాస్త 21 రోజులైనా జరుగుతునే ఉంది. ఇంకా ఈ యుద్ధం ఎన్నిరోజులు జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఇదేసమయంలో యుద్ధంలోకి గల్ఫ్ లోని చాలా దేశాలు అనివార్యంగా భాగస్వాములవ్వాల్సొచ్చింది. యుద్ధం కారణంగా దెబ్బతిన్న దేశాల్లో ఖతార్ కూడా ఒకటి. ఏరోజు ఇరాన్ దెబ్బకు ఏ దేశం పరిస్ధితి ఎలాగుంటుందో అర్ధంకాక చాలా దేశాలు అయోమయంలో పడిపోయాయి. ఈ సమయంలోనే ఖతార్ లోని రాజకుటుంబీకుల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శల పాలవుతోంది. ఆ నిర్ణయం ఏమిటంటే తమ దగ్గరున్న మేలుజాతి గుర్రాలను ప్రత్యేకంగా విదేశాలకు తరలించటం.

ఇరాన్ దాడుల కారణంగా తమ గుర్రాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న టెన్షన్‌తో ఖతార్ రాజకుటుంబీకులు తమదగ్గర ఉన్న 147గుర్రాలను ప్రత్యేక విమానంలో బెల్జియంకు తరలించారు. ఖతార్ గగనతలం మూసేసిన కారణంగా 450కిలోమీటర్ల దూరంలోఉన్న సౌదీఅరేబియాలోని రియాద్‌కు రోడ్డుమార్గంలో గుర్రాలను తరలించారు. అక్కడినుండి ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల్లోకి గుర్రాలను ఎక్కించారు. రియాద్‌నుండి బెల్జియంకు 6గంటల ప్రయాణం. ప్రయాణంలోనే కాకుండా బెల్జియంలో ఉన్నన్నిరోజులు గుర్రాల సంరక్షణకోసం రాజకుటుంబీకులు ప్రత్యేకంగా 90 మంది వైద్యులు, సిబ్బందిని కూడా బెల్జియంకు పంపించారు. విమానంలో గుర్రాలకు దాణా, మంచినీరు, మలవిసర్జన చేసినపుడు శుభ్రంచేయటం కోసమే రాజకుటుంబీకులు ఈ 90మందిని పంపించారు.

ఒకవైపు లక్షలాదిమంది జనాలు ఎప్పుడు ఏమవుతుందో తెలీక ఖతార్‌లో ప్రాణభయంతో అల్లాడిపోతుంటే రాజకుటుంబీకులు తమగుర్రాలను మాత్రం ప్రత్యేక విమానంలో బెల్జియంకు తరలించటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ చర్యతోనే రాజకుటుంబీకులకు మామూలు జనాల ప్రాణాలకన్నా గుర్రాల ప్రాణాలే ఎక్కువని అర్ధమైంది.

Read More
Next Story