క్వాక్ అరినా రైడ్.. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్
x

క్వాక్ అరినా రైడ్.. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

గచ్చిబౌలి పరిధిలో పబ్‌లపై తనిఖీలు, ప్రముఖుల పిల్లలు సహా పలువురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో కేసు నమోదు.


హైదరాబాద్ నైట్‌లైఫ్‌పై మరోసారి పోలీసుల గట్టి దాడి పడింది. గచ్చిబౌలి పరిధిలోని పబ్‌లలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో డ్రగ్స్ వినియోగం బయటపడగా, కొండాపూర్‌లోని క్వాక్ అరినా పబ్ కేంద్రంగా ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ జరుగుతున్న సమయంలో డ్రగ్స్ వినియోగంపై ముందస్తు సమాచారం అందడంతో ఈగల్ టాస్క్ ఫోర్స్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలతో పబ్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

పబ్‌లో ఉన్నవారికి అక్కడికక్కడే డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 64 మందిని పరీక్షించగా, ఎనిమిది మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రత్యేక పరీక్ష కిట్లతో నిర్వహించిన తనిఖీల్లో కొందరు గంజాయి, బెంజోడియాజెపైన్ వాడగా, మరికొందరు గంజాయి, మెథాంఫెటమిన్ తీసుకున్నట్లు తేలింది. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

డ్రగ్స్ తీసుకున్న వారిలో వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు అకెళ్ల హరిత్ సారంగ కూడా ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి సమయంలో నటి హేమ కూడా పబ్‌లో ఉన్నారు. కాగా ఈ రైడ్‌లో చేసిన డ్రగ్ టెస్ట్‌లో తనకు నెగిటివ్‌గా వచ్చిందని హేమ స్వయంగా వెల్లడించారు.

ఇది అదే పబ్‌లో ఇటీవల రెండోసారి వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కావడం గమనార్హం. గత ఘటన తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో పబ్ యాజమాన్యంపై చర్యల దిశగా పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఐటీ కారిడార్‌లోని నైట్‌లైఫ్ కేంద్రాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read More
Next Story