
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారాం నా బాధ్యత: రేవంత్
చిన్నారుల విద్య, పోషకాహారంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడం తన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటానని, అందులో భాగంగానే మిడ్ డే మీల్స్ పథకంలోకి చేప, చికెన్‌ను కూడా జోడించనున్నామని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. శాసన మండలి హాల్‌లో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 0 నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాస సామర్థ్యాలపై ఉన్న సమస్యలను నిపుణుడు వివరించినట్లు తెలిసింది. చిన్న వయసులో సరైన పోషణ, బోధన లేకపోతే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు పెరిగే ప్రమాదం ఉందని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.
అంగన్‌వాడీల్లో పోషకాహారం మరింత మెరుగుపరచేందుకు అదనపు సిబ్బంది అవసరమని నిపుణుడు సూచించినట్లు తెలిసింది. దీనిపై "పోషణ సఖి" నియామకాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇక, ఈ సూచనలను క్యూఆర్ పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను కోరారు. చిన్నారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.

