మధురలో సీతారాముడి రూపంలో దర్శనమిచ్చిన రాధాకృష్ణుడు
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఓ అపూర్వ ఘట్టం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరుగుతున్న వేళ శ్రీ కృష్ణ జన్మస్థలం మధురలోనూ వేడుకలు మొదలయ్యాయి. అక్కడి సుమారు 700 ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
మధురలోని శ్రీకృష్ణ మందిరంలో రాధాకృష్ణుడి విగ్రహాలు రాముడు, సీత రూపంలో దర్శనమిచ్చేలా అలంకరించామని శ్రీకృష్ణ జన్మభూమి సేవా సంస్థాన్ కార్యదర్శి కపిల్ శర్మ తెలిపారు.
బంకే బిహారీ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం వేణువుతో పాటు విల్లు, బాణం పట్టుకుని దర్శనమిచ్చాడు.
ఠాకూర్ ద్వారకాధీష్ ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
సుందరంగా అలంకరించిన కేశవదేవ్ ఆలయంలో ఉదయం నుంచి సుందర్ కాండను వినిపించారు.
గోవర్ధన్ కూడలిలో ఆర్టిస్ట్ సమీర్ రూపొందించిన సైకత అయోధ్య రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటుగా వెళ్లే భక్తులను ఆకట్టుకుంది.
దేవర్హా ఘాట్, కన్హా గౌశాల వద్ద యమునా నది నుంచి తెచ్చిన ఇసుకతో ఒడిశాకు చెందిన కళాకారులు రామాలయం, బాలరాముడిని నమూనాలను తయారుచేశారని మునిసిపల్ కార్పొరేషన్ బృందావన్ కార్యాలయంలో టాక్స్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ వశిష్ఠ తెలిపారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు
గత రెండు రోజులుగా మట్టి దీపాలను భారీగా కొనుగోలు చేశారు. ఇతర లైటింగ్ పరికరాలు, జెండాలు మొదలైనవి విరివిగా అమ్ముడయ్యాయి.
సాయంత్రం 4 గంటలకు దేవ్రాహా బాబా ఘాట్‌లో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 500 కిలోల పూలతో అలంకరించిన జుగల్ ఘాట్‌లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని దాదాపు 700 దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శైలేష్ కుమార్ పాండే తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్‌ఎస్పీ పాండే తెలిపారు. హోటళ్లు, ఆశ్రమాలను తనిఖీ చేస్తూ.. డ్రోన్‌ల ద్వారా నగరాన్ని పర్యవేక్షించామన్నారు. షాహీ ఈద్గాకు వెళ్లే మార్గంలో స్థానికులకు మాత్రమే అనుమతిస్తామని ఎస్‌ఎస్పీ తెలిపారు. స్థానికుల బంధువులను విచారించాకే ఆ దార్లోకి వెళ్లనిస్తున్నామని పేర్కొన్నారు. బాంకే బిహారీ ఆలయంతో పాటు ఇతర ఆలయాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు.