
రహ వీర్: వారిని కాపాడితే రూ.25 వేల రివార్డు
రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్‌లో సహాయం చేస్తే రివార్డు. తెలంగాణలో అమలవుతున్న రహ-వీర్ పథకం పూర్తి వివరాలు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రజలు ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ‘రహ-వీర్’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రమాద సమయంలో సహాయం చేసి ప్రాణాలు కాపాడితే నగదు బహుమతి ప్రకటించింది.
ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా గుర్తిస్తారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేసులు, పోలీస్ విచారణ భయంతో సహాయం చేయడానికి వెనుకాడే పరిస్థితిని మార్చడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
రహ-వీర్ అంటే ఎవరు?
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం చేసి, గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వ్యక్తిని ప్రభుత్వం ‘రహ-వీర్’గా గుర్తిస్తుంది. ప్రాణాలను కాపాడే ధైర్యం చూపిన వారిని గౌరవించడమే ఈ గుర్తింపు.
తీవ్రంగా గాయపడిన రోడ్డు ప్రమాద బాధితుడికి సహాయం చేసిన ఎవరైనా ఈ పథకానికి అర్హులు. బాధితుడు పెద్ద శస్త్రచికిత్స అవసరమైన స్థితిలో ఉండటం, మూడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఆసుపత్రిలో ఉండటం, మెదడు లేదా వెన్నుపాము గాయాలు కలగటం, చికిత్స సమయంలో మరణం సంభవించటం వంటి సందర్భాలు ఇందులోకి వస్తాయి.
రహ-వీర్‌గా గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తికి రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తారు. ఒకే బాధితుడిని పలువురు కలిసి కాపాడితే ఆ మొత్తం సమానంగా పంచుకుంటారు. ఒకే ప్రమాదంలో పలువురు బాధితులు ప్రాణాలతో బయటపడితే ఒక్కో బాధితుడికి రూ.25 వేల చొప్పున వర్తిస్తుంది. నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా ఇస్తారు.
జిల్లా స్థాయి కమిటీ పాత్ర
ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ, జిల్లా వైద్యాధికారి, రవాణా శాఖ అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి చేర్చిన వ్యక్తి వివరాలను పోలీసులు లేదా ఆసుపత్రి సిబ్బంది నమోదు చేస్తారు.
నమోదైన వివరాలను జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. ప్రమాద తీవ్రత, సహాయం చేసిన సమయం వంటి అంశాలను పరిశీలించిన తర్వాత రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తుంది. ఆమోదం లభించిన వెంటనే నగదు నేరుగా రహ-వీర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
సహాయం చేసిన వ్యక్తులకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. పోలీసులు బలవంతంగా ప్రశ్నించడం, సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయడం చేయరాదు. మంచి ఉద్దేశంతో సహాయం చేసిన వారికి పౌర లేదా క్రిమినల్ బాధ్యత ఉండదు. ఆసుపత్రులు కూడా సహాయం చేసిన వ్యక్తి నుంచి డబ్బులు అడగరాదు.
ఎందుకు ఈ పథకం కీలకం?
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సహాయం ఆలస్యం కావడం వల్ల అనేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. రహ-వీర్ పథకం ద్వారా భయాన్ని తొలగించి, మానవతను ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. రహ-వీర్ పథకం ప్రాణాలను కాపాడే వారి ధైర్యానికి గుర్తింపు. ప్రమాద సమయంలో స్పందించే ప్రతి ఒక్కరూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

