‘యుద్ధానికి సిద్ధంకండి’.. వికారాబాద్‌లో రాహుల్ పిలుపు
x

‘యుద్ధానికి సిద్ధంకండి’.. వికారాబాద్‌లో రాహుల్ పిలుపు

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పీఏసీ సమావేశం. ప్రధాని మోదీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం.


పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాహుల్ సూచించారు. క్షేత్రస్థాయిలో బలోపేతానికి ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలని నేతలకు చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ ట్రేడ్ ఒప్పందంతో కూడా ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలో పార్టీ, ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాహుల్ వెల్లడించారు. సామాజిక అంశాలపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని సీనియర్ నేత వీహెచ్ విజ్ఞప్తి చేశారు. అందుకు రాహుల్ సమ్మతి తెలిపారు. గత తొమ్మిది రోజులుగా ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం అనంతగిరిలో కొనసాగుతోంది.

నేడు జరిగే ముగింపు కార్యక్రమంలో రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి అనంతగిరి హరితా రిసార్ట్స్‌కు వెళ్లారు. రాజకీయంగా కీలకమైన ఈ భేటీతో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. నేతలు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

Read More
Next Story