రాహుల్ ‘బిస్కెట్’ వీడియోపై బీజేపీ నేతల ఘాటు విమర్శలు
కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేందుకు దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు. నెట్టింటో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. యాత్ర మధ్యలో రాహుల్ గాంధీ ఓ కుక్కపిల్లకు బిస్కెట్ ఇవ్వడం, అది తినకపోవడంతో దాన్ని తెచ్చిన పార్టీ సపోర్టర్‌కు ఇస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది.
ఈ వీడియో చూసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నపుడు ఢిల్లీలోని సోనియా ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని, అక్కడ జరిగిన ఘటన గురించి శర్మ చెప్పుకొచ్చారు.
‘‘రాహుల్ పెంపుడు కుక్క ప్లేట్‌లో ఉన్న బిస్కెట్లు తినింది. అదే ప్లేట్‌లోని బిస్కెట్లను అక్కడికి వచ్చిన పార్టీ నాయకులకు ఇచ్చారు. రాహుల్ గాంధీ మాత్రమే కాదు కుటుంబం మొత్తం నాతో ఆ బిస్కెట్ తినిపించలేకపోయారు. నేను గర్వించదగ్గ అస్సామీని. పైగా భారతీయుడిని. నేను తినడానికి నిరాకరించాను. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశా’’నన్నారు శర్మ.
బీజేపీ నేత అమిత్ మాల్వియా కూడా హిమంత బిస్వా శర్మకు తోడయ్యారు. ఆయన కూడా రాహుల్‌ను కామెంట్ చేశారు. ‘‘యువరాజు కార్యకర్తలను కుక్కలాగా చూస్తే పార్టీ అంతరించిపోవడం సహజమే’ అని విమర్శించారు.
కుక్కపిల్ల బిస్కెట్ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ మద్దతుదారులు రంగంలోకి దిగారు. అలా జరగలేదంటూ వివరణ ఇచ్చారు. బిస్కెట్‌ను కుక్కపిల్ల తినకపోవడంతో దాన్ని తీసుకొచ్చిన వ్యక్తికి బిస్కెట్ ఇచ్చి తినిపించాలని రాహుల్ కోరాడని వారు చెబుతున్న మాట.
హిమంత బిస్వా శర్మ గురించి..
హిమంత బిస్వా శర్మ 2021 నుంచి అస్సాం సీఎంగా కొనసాగుతున్నారు. జోర్హాట్‌లో జన్మించిన హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2001 నుంచి 2015 వరకు కాంగ్రెస్ తరుపున అస్సాంలోని జలుక్‌బారి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. డాక్టర్ శర్మ ఆగస్టు 2015లో భారతీయ జనతా పార్టీలో చేరారు.