
ములుగు ‘ఉపాధి హామీ’ నిరసన ర్యాలీకి రానున్న రాహుల్ గాంధీ
మార్చి మూడో వారంలో ములుగులో ఉపాధి హామీ పథకం మార్పులకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ చట్టం (MGNREGA) రద్దుకు నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే నిరసనల్లో భాగంగా లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ వస్తున్నట్లు తెలిసింది. మార్చ్ నెల రెండవ లేదా మూడవ వారంలో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీనియోజకవర్గ కేంద్రమయిన ములుగు పట్టణంలో భారీ సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నిరసన సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపారని పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆదివాసీలు బలంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రజా ర్యాలీని నిర్వహించాలని సూచించగానే రాహుల్ గాంధీ స్వయంగా నిరసనలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారని కాంగ్రెస్ నాయకులొకరు తెలిపారు.
ములుగులో గ్రామీణ ఉద్యోగ హామీ పథకం బాగా విజయవంతమయింది. అక్కడ భారీగా అదివాసీలు పథకానికి తన పేర్లు నమోదు చేసుకున్నారు. అందువల్ల మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకం వల్ల ఇక్కడి ప్రజలకు బాగా నష్టం జరుగుతుంది. అందుకే రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి దనసరి అనసూయ( సీతక్క) పార్టీ నిరసన ప్రదర్శనకు ములుగుపేరు సూచించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాపితంగా జరుపుతున్న MGNREGA బచావో సంగ్రామ్ పర్యవేక్షక కోర్ కమిటీ సభ్యురాలుగా నియమితులయ్యారు.
దానికితోడు కాంగ్రెస్ పార్టీ, నాటి యునెటైడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలుజరిగిన తీరును ప్రశంసిస్తూ వచ్చింది. ఈ పథకం అమలయ్యేనాటికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాకరంగా అమలు చేస్తూ వచ్చింది. నిజానికి ఈ పథకాన్ని ప్రధాని మన్మోహన సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించారు. అందువల్ల ఈ పథకం అమలు తీరునుంచి నాటి కేంద్ర ప్రభుత్వం పలు అంశాలను గమనించి జాతీయ స్థాయిలో అమలు చేసింది.
ఈ లెక్కన తెలంగాణ కు చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ కారణంగానే, రాహుల్ గాంధీ ములుగు నిరసనలో పాల్గొంటున్నారు. రెండు రోజుల కిందట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ మంత్రులతో జరిపిన సమావేశంలో ఈ విషయం చర్చుకు వచ్చింది. అక్కడే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన చర్చించి, ములుగు నిరసన ప్రదర్శనలో స్వయంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చారని తెలిసింది.

