రాహుల్ కారు అద్ధం ధ్వసం.. కారణం అదే..
‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ చేపడుతున్న రాహుల్‌గాంధీ కారు అద్ధం పగలడంపై భిన్న స్వరాలు వినిపించాయి. చివరకు కాంగ్రెస్ పార్టే ఘటనపై క్లారిటీ ఇచ్చింది.
‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ చేపడుతున్న రాహుల్ కారు అద్దం పగిలింది. ఈ ఘటనపై మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరిపై మాట్లాడారు. మాల్దా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై ‘‘రాళ్లతో దాడి చేశారని’’ ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ తన అధికారిక (ఎక్స్) ట్విట్టర్‌లో కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల అద్ధం ధ్వంసమైందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి జనవరి 12న యాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ముంబైలో యాత్ర పూర్తవుతుంది. 15 రాష్ట్రాల మీదుగా 66 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.
సడన్ బ్రేక్ వేయడం వల్లే..
‘‘పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో రాహుల్‌ను కలవడానికి భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఒక మహిళ రాహుల్‌ను కలవడానికి అకస్మాత్తుగా కారు ముందుకు వచ్చింది. దీంతో కారు డ్రైవరు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. సెక్యూరిటీ సర్కిల్‌గా ఉపయోగించిన తాడు కారణంగా కారు అద్దం పగిలింది.’’ ‘‘ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ న్యాయం కోసం పోరాడుతున్నాడు. ప్రజలు రాహుల్‌తో ఉన్నారు. ప్రజలు రాహుల్‌ను సురక్షితంగా ఉంచుతున్నారు.’’ అని పోస్టు చేశారు.
ఘటన బీహార్‌లో జరిగింది : మమతా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడిని ఖండిరచారు. పొరుగున ఉన్న బీహార్‌లోని కతిహార్ ప్రాంతంలో జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.
‘‘రాహుల్ గాంధీ కారుపై రాళ్లతో దాడి చేసినట్లు నాకు సందేశం వచ్చింది. నేను ఘటన గురించి పూర్తిగా తెలుసుకున్నాను. అది బెంగాల్‌లో కాకుండా కతిహార్‌లో జరిగిందని తెలిసింది. అప్పటికే పగిలిపోయిన అద్దాలతో కారు బెంగాల్‌లోకి ప్రవేశించింది. దాడిని ఖండిస్తున్నాను.’’ అని బెనర్జీ అన్నారు.
బీహార్‌లో నితీష్ కుమార్ విపక్ష కూటమి విడిచి ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీలోకి చేరడం వల్ల ఆగ్రహానికి గురైన ప్రజలు దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
‘‘నితీష్ ఇటీవల వారు బిజెపితో చేతులు కలిపారు, వారికి కొంత కోపం ఉండవచ్చు’’ అని టీఎంసీ అధిపతి అన్నారు.