శంషాబాద్‌లో ట్రై రైల్వే జంక్షన్
x
శంషాబాద్‌లో ట్రై రైల్వే జంక్షన్ నుంచి బెంగళూరు–చెన్నై–పూణేనగరాలతో ట్రయాంగిల్ కనెక్టివిటీ (ఎక్స్ పోస్టు/ ఇండియన్ రైల్వే) సౌజన్యంతో)

శంషాబాద్‌లో ట్రై రైల్వే జంక్షన్

బెంగళూరు–చెన్నై–పూణేనగరాలతో ట్రయాంగిల్ కనెక్టివిటీ, డిపిఆర్ రెడీ


దక్షిణ భారతదేశ రవాణా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్లు రూపుదిద్దుకోనున్నాయి. శంషాబాద్‌ను ట్రై-జంక్షన్‌గా అభివృద్ధి చేస్తూ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపే ప్రణాళికకు కేంద్ర-రాష్ట్ర స్థాయిలో కదలిక మొదలైంది. ప్రయాణ సమయాన్ని గంటల వ్యవధిలోకి తగ్గిస్తూ, ఐటీ–పారిశ్రామిక కేంద్రాలను అనుసంధానించే ఈ మెగా ప్రాజెక్ట్ తెలంగాణతో పాటు దక్షిణ భారత అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారనుందని భావిస్తున్నారు.

నిర్మాణంలో కదలిక

హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కదిలిక వచ్చింది. కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ త‌యారీ బాధ్య‌త‌ను రైల్వే శాఖ రైట్స్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌కు అప్ప‌జెప్పింది.జాతీయ రైలు ప్రణాళికలో భాగంగా హై-స్పీడ్ కారిడార్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ హైస్పీడ్ రైళ్లు రాబోయే దశాబ్దాల్లో ప్రయాణికుల అవసరాలను తీర్చనుంది.

శంషాబాద్‌లో ట్రై రైల్వే జంక్షన్ నిర్మాణం

హైద‌రాబాద్‌ - చెన్నై (778 కిలోమీటర్లు), హైద‌రాబాద్‌ - బెంగ‌ళూర్ (586 కిలోమీటర్లు), హైద‌రాబాద్‌ - పుణే (556 కిలోమీటర్లు) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స‌మీపంలో 500 ఎక‌రాల స్థ‌లం కేటాయిస్తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చెప్పారు. రైట్స్ సంస్థ ప్ర‌తినిధులు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో హైస్పీడ్ రైళ్లకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అలైన్‌మెంట్లు, డీపీఆర్‌కు సంబంధించి వారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే హైస్పీడ్ రైలు మార్గాల‌ని ప్రారంభించాల‌ని సీఎం సూచించారు.
‘‘హైద‌రాబాద్‌ - బెంగ‌ళూరు,హైద‌రాబాద్‌ -చెన్నై, హైద‌రాబాద్‌ - పూణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభమైతే అది ట్రై జంక్ష‌న్ అవుతుంది’’అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

త్వరలో హైస్పీడ్ రైలు మార్గాలకు భూసేకరణ

హైదరాబాద్ నుంచి మూడు ప్రధాన నగరాలకు నిర్మించబోయే హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి భూ సేక‌ర‌ణ వెంట‌నే చేప‌ట్టి ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరగా, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ సానుకూల‌త వ్య‌క్తం చేశారు. త్వరలోనే భూసేకరణ ప‌నులు ప్రారంభిస్తామ‌ని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.హైద‌రాబాద్‌ - చెన్నై హైస్పీడ్ కారిడార్ అమ‌రావతి మీదుగా వెళుతుంద‌ని, అక్క‌డి నుంచి బంద‌రు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాల‌ని సీఎం కోరారు.తద్వారా డ్రైపోర్ట్ నుంచి బంద‌రు పోర్టుకు స‌ర‌కు ర‌వాణా వేగ‌వంతం అవుతుంద‌ని చెప్పారు.ఈ కారిడార్లు 4,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.

హై-స్పీడ్ ట్రయాంగిల్ రైళ్లు

గంటకు 250 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ రైళ్లు నడపాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మూడు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సర్వీసు, భద్రత అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిగ్నలింగ్, కమ్యూనికేషన్, సేఫ్టీ టెక్నాలజీతో హైస్పీడ్ రైళ్లను నడపనున్నారు. దేశంలోని దక్షిణ ప్రాంతాలలో, హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను ప్రధాన మెట్రోపాలిటన్, ఆర్థిక కేంద్రాలను అనుసంధానించడానికి రూపొందించిన దక్షిణ హై-స్పీడ్ ట్రయాంగిల్ రైళ్లు కీలకం కానున్నాయి.

ప్రయాణ సమయం ఎంతంటే...

బెంగళూరు-హైదరాబాద్ కారిడార్ ప్రయాణ సమయాన్ని 2 గంటలకు తగ్గిస్తుందని, దీనివల్ల ప్రధాన ఆర్థిక, ఐటీ కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయనుందని భావిస్తున్నారు.చెన్నై-హైదరాబాద్ కారిడార్ ప్రయాణ సమయాన్ని 2 గంటల 55 నిమిషాలకు తగ్గిస్తుందని, ఇది దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు.ముంబై-పూణే కారిడార్ గంట 55 నిమిషాల ప్రయాణ సమయంతో అంచనా వేశారు. ఈ మార్గం ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పశ్చిమ భారతదేశంలో హై-ఫ్రీక్వెన్సీ ఇంటర్-సిటీ ప్రయాణానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.1 గంట 55 నిమిషాల ప్రయాణ సమయంతో పూణే-హైదరాబాద్ కారిడార్, దక్షిణ కేంద్రాలకు ముందుకు హై-స్పీడ్ లింక్‌లను సృష్టిస్తుంది.

కృష్ణా - వికారాబాద్ రైలుమార్గం నిర్మించండి

కృష్ణా - వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో నిర్మించాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ తో పార్ల‌మెంట్‌లోని ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి భేటీ అయ్యారు. ఈ మార్గంలోని టేక‌ల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాల‌ను గుర్తించామ‌ని, అలాగే సిమెంట్‌, జౌళి ప‌రిశ్ర‌మ‌ల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.
తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు క‌ర్ణాట‌క‌లోని ప‌లు సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌మీపంలో కృష్ణా ప్రాంతం ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగ‌ల్‌, టేక‌ల్‌కోడ్‌, దౌల్తాబాద్‌ల‌ను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు సీఎం వివరించారు.
మొత్తానికి హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ హైస్పీడ్ ట్రయాంగిల్ ప్రాజెక్ట్ దక్షిణ భారత రవాణా చిత్రాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గంటల్లోనే మెట్రో నగరాలను కలిపే ఈ రైలు మార్గాలు కేవలం ప్రయాణ సౌకర్యానికే కాదు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త దారులు తెరవనున్నాయి. భూసేకరణ నుంచి నిర్మాణం వరకు అన్ని దశలు వేగంగా పూర్తి అయితే, రాబోయే దశాబ్దాల్లో హైదరాబాద్ నిజమైన హైస్పీడ్ హబ్‌గా అవతరించడం ఖాయం.
Read More
Next Story