
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగరం నుంచి మరో 3 కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు ప్రారంభం.
పెరుగుతున్న జనాభా, ఆయా మార్గాలలో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే.. నూతన రైలు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు గత 12 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా భారతీయ రైల్వే 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించింది. ఈ రైళ్లన్నీ కూడా జంట నగరాల పరిధిలోని రైల్వేస్టేషన్ల నుంచే (హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి టర్మినల్) ప్రారంభమవుతున్నాయి. కొత్త సర్వీసుల ప్రారంభంతో పాటుగా.. ఇప్పటికే నడుస్తున్న రైలు సర్వీసుల్లో.. పాత కోచ్ లను ఆధునీకరించి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది.
ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ కు అనుగుణంగా సేవలు అందిస్తున్న మూడు స్పెషల్ ట్రైన్స్‌ను.. రెగ్యులర్ ట్రైన్స్‌గా మారుస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయంలో భాగంగా..
● రైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం. 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
● రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును రైలు నం. 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
● రైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం. 17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
మొత్తంగా 3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి మోదీ గారికి, రైల్వే శాఖమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 36,286 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 47,984 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, రూ. 2,668 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 రైల్వేస్టేషన్లను అధునాతన సౌకర్యాలతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు. ఇటీవలే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను మంజూరు చేశారని, ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో కీలకం కానున్నాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 5 వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయని, రానున్న రోజులలో మరిన్ని అధునాతన రైళ్లు, రద్దీ ఉన్న మరిన్ని కొత్త మార్గాలకు రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి కృషి చేస్తామని కిషన్ రెడ్డి తెలియజేశారు.

